సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైన రాష్ట్ర పోలీసులు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌ల మాదిరి పోలీసులు నడిరోడ్డుపై డ్రగ్ పరీక్షలు చేయనున్నారు. డ్రగ్స్ వినియోగించినవారిని డ్రగ్ అనలైజర్ల సాయంతో గుర్తించనున్నారు. తొలుత ఒకట్రెండు డ్రగ్ అనలైజర్లను కొనుగోలు చేసి, ఎంపిక చేసిన ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించి, వాటి ఫలితాలను అధ్యయనం చేయనున్నారు. అవి ఉపయుక్తంగా ఉన్నాయని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసి విస్తృతంగా వాటిని వినియోగించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఎలా పరీక్షిస్తారంటే..?
చిన్నసైజు టూత్‌బ్రష్(టెస్ట్ కాట్రిడ్జ్) ఆకారంలో ఉండే ఉపకరణాన్ని అనుమానితులు నోటిలో పెట్టుకొని బ్రష్ చేసినట్లుగా తిప్పాలి. ఆ తర్వాత ఏటీఎంలో కార్డ్ పెట్టినట్లుగా ఆ కాట్రిడ్జ్‌ను డ్రగ్ అనలైజర్ డివైజ్‌లో పెడితే చాలు రెండు నిమిషాల్లో ఫలితాలను దాని స్క్రీన్ మీద చూపిస్తుంది. ఒకవేళ డ్రగ్ తీసుకున్నట్లయితే ఎరుపు రంగులో, లేకపోతే ఆకుపచ్చ రంగులో చుక్కలు కనిపిస్తాయి.
అయితే ఇది ప్రాథమిక పరీక్ష మాత్రమే! పరీక్షలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి నుంచి మూత్రం, రక్తం నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాతే మరింత స్పష్టమైన నిర్ధారణకు వస్తారు. డ్రగ్ అనలైజర్ గంజాయి, హష్ ఆయిల్, కొకైన్, హెరాయిన్ వంటి అన్ని రకాల మాదక ద్రవ్యాలను గుర్తిస్తుంది. ఎంత మోతాదులో డ్రగ్ తీసుకున్నారు? తీసుకొని ఎంత సమయమవుతోంది? వంటి వివరాలను స్క్రీన్ మీద చూపిస్తుంది. దాన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఈ డివైజ్‌కు జీపీఎస్ కూడా ఉంటుంది. దీంతో ఏ ప్రాంతంలో డ్రగ్ పరీక్షలు నిర్వహించారో సాంకేతిక ఆధారాలుంటాయి.
వీటిని ఎవరు వినియోగిస్తారంటే..?
డ్రగ్ పరీక్షలను లా అండ్ ఆర్డర్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేస్తారని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. నగరంలో ఎక్కువగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లుగా గుర్తించిన హాట్‌స్పాట్లలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. పైలట్ ప్రాజెక్ట్‌గా తొలుత కొన్ని ప్రాంతాల్లో చేపట్టి, వాటి ఫలితాలను బట్టి విస్తరిస్తామని పేర్కొన్నారు.
ఎవరికి టెస్ట్‌లు చేస్తారంటే?
కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రగ్ అనలైజర్లను వినియోగిస్తున్నారు. వాటి ఫలితాలను మన రాష్ట్ర పోలీసులు అధ్యయనం చేసి, మెరుగైన ఫలితాలు వస్తున్నాయని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. పట్టుబడిన డ్రగ్ పెడ్లర్ల నుంచి కస్టమర్ల వివరాలను సేకరించి వారికి కూడా పరీక్షలు చేస్తారు. కేస్ స్టడీల ఆధారంగా డ్రగ్స్ çసరఫరా జరిగే ప్రాంతాలను గుర్తిస్తారు. పబ్‌లు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాలపై నిఘా పెడతారు. ఈ క్రమంలో డ్రగ్స్ తీసుకొని దొరికివాళ్ల డేటాను రికార్డ్‌లోకి ఎక్కిస్తారు. పోలీస్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment