షాద్‌నగర్/ హత్నూర (సంగారెడ్డి): రెండు వేర్వేరు ఘటనల్లో నీట మునిగి ఐదుగురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ఇందులో ముగ్గురు చిన్నారులు సరదాగా ఆడుకోవడానికి వెళ్లి నీటి గుంతలోపడి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు బాలురు చెరువులో స్నానానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్ గ్రామానికి చెందిన సలీం, ఫిర్దోస్ దంపతుల కుమారుడు సైఫ్ (7), నయీమ్, ఖతీజా దంపతుల కొడుకు ఫరీద్ (13), భిక్షపతి, శివలీల దంపతుల కుమారుడు అక్షిత్‌గౌడ్ (8), సంజయ్‌కుమార్‌లు స్నేహితులు.
స్థానిక ప్రభుత్వ పాఠశాలలో వీరు చదువుకుంటున్నారు. స్కూలుకు దసరా పండుగ సెలవులు ఇవ్వడంతో సోమవారం ఉదయం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ వద్ద ఆడుకునేందుకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత అక్కడ పనులకోసం తీసిన నీటి గుంతలోకి దిగారు. అయితే గుంత దాదాపు పది అడుగుల లోతు ఉండటంతో సైఫ్, ఫరీద్, అక్షిత్‌గౌడ్ నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటనలో సంజయ్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తమ పిల్లలను విగతజీవులుగా చూసి వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
షాద్‌నగర్‌లో ధర్నా
ఈ సమాచారం అందుకున్న ఏసీపీ కుషాల్కర్, సీఐ నవీన్‌కుమార్ చిన్నారుల మృతదేహాలను బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు కోసం మట్టి వేసేందుకు తీసిన గుంతల్లో పడి చిన్నారులు మృతి చెందారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుల కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. అక్షిత్‌గౌడ్ మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళుతున్న క్రమంలో కుటుంబ సభ్యులు చౌరస్తాలో ఒక్కసారిగా మెరుపు ధర్నా నిర్వహించారు. మృతదేహంతో అక్కడ బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.
చెరువులో స్నానానికి వెళ్లి..
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన చిరుమని చెన్నయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా, సోమవారం అంత్యక్రియలు జరిగాయి. అనంతరం చెన్నయ్య బంధువులైన చిలువరి మహేశ్ (17), చిలువరి అరవింద్ (16)లు బంధువులతో కలసి గ్రామ సమీపంలోని చెరువులోకి స్నానానికి వెళ్లారు. అయితే చెరువులో లోతైన ప్రదేశంలోకి వెళ్లిన వీరు నీటిలో మునుగుతూ తేలుతూ అరుస్తుండగా, అక్కడే ఉన్న బంధువులు రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అరగంట తర్వాత మహేశ్, అరవింద్‌లు విగతజీవులుగా కనిపించారు. మహేశ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, అరవింద్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దీనిపై పోలీసులను సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment