పెట్టుబడులు, ఉపాధి, నూతన ఆవిష్కరణలు లక్ష్యంగా సర్కారు ప్రణాళికలు
విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో ఏఐ వినియోగానికి కసరత్తు
5, 6 తేదీల్లో జరగనున్న తెలంగాణ గ్లోబల్ ఏఐ సమ్మిట్
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతికతను అనుకూలంగా మలచుకొని పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఆవిష్కరణల రంగాల్లో అగ్రగామిగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 5, 6 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గ్లోబల్ ఏఐ సమ్మిట్ పేరిట రెండు రోజుల సదస్సు నిర్వహిస్తోంది. ఈ సదస్సు ద్వారా కృత్రిమ మేథ (ఏఐ) సహా ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించి ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.
పాఠ్య పుస్తకాల్లో ‘ఏఐ పాఠాలు’
కృత్రిమ మేథ (ఏఐ)కు ఉన్న భవిష్యత్తు దృష్ట్యా ఇప్పటి నుంచే ఈ రంగం అభివృద్ధికి మౌలికవసతులు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తద్వారా కొత్త తరం ఆవిష్కర్తలు, పెట్టబడిదారులను రప్పించడం లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయం, ఆరోగ్యం, విద్య తదితర రంగాల్లో ఏఐ సాంకేతికత వినియోగం ద్వారా అభివృద్ధి సాధించాలని భావిస్తోంది.
ఏఐ సాయంతో వ్యవసాయ ఉత్పాదకత పెంచడం, పౌరులందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయడంతోపాటు ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఏఐ పాఠ్యాంశాలను చేర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏఐతోపాటు ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీ పాఠాలను బోధించడం ద్వారా భవిష్యత్తు తరానికి నిత్య జీవితంలో వాటి వినియోగంపై అవగాహన పెంచడం సాధ్యమవుతుందని భావిస్తోంది. ఏఐ ద్వారా వాతావరణ మార్పులను ముందే గుర్తించి రైతులు, ప్రజలను అప్రమత్తం చేసేలా నూతన ఆవిష్కరణలకు ఊతమివ్వనుంది.
స్కిల్స్ యూనివర్సిటీలో ఏఐకి ప్రాధాన్యత
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఏఐ సాంకేతికతపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా కోర్సులకు రూపకల్పన జరుగుతోంది. మరోవైపు ప్రభుత్వం చెబుతున్న ఫోర్త్ సిటీలోనూ ఏఐ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న నూతన పారిశ్రామిక పాలసీని కూడా ఏఐ టెక్నాలజీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ, ఆవిష్కరణలు, ఇంక్యుబేటర్లు, స్టార్టప్‌లను ప్రోత్సహించేలా రూపొందిస్తున్నారు.
ఇతర సాంకేతికతలతో ఏఐ మేళవింపు ద్వారా దేశీయ పరిస్థితులకు అనుగుణంగా ‘డ్రైవర్ లెస్ టెక్నాలజీ’పై ఐఐటీ హైదరాబాద్‌లో పరిశోధనలు జరుగుతున్నాయి. దేశీయంగా రోడ్లు, మౌలికవసతులకు సంబంధించిన అనేక సంక్లిష్ట అంశాలను దృష్టిలో పెట్టుకొని ‘డ్రైవర్ లెస్’వాహనాలపై జరుగుతున్న పరిశోధనల విషయంలో ఆసక్తి చూపుతున్న ప్రభుత్వం వీలైనంత త్వరగా కొత్త టెక్నాలజీని రాష్ట్రంలో అందుబాటులోకి తేవాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment