సాక్షి, హైదరాబాద్: మైనర్ల వివాహాలకు అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. మైనార్టీ తీరనివారికి పెళ్లి జరిపిన ఖాజీలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ప్రతి ‘షాదీ’ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని వక్ఫ్ బోర్డును ఆదేశించింది. మ్యారేజ్ సర్టిఫికెట్లను కూడా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంచాలని నిర్దేశించింది. యుక్త వయసు రాకముందే పెళ్లిళ్లు జరుగుతుండడం.. కొందరు షేక్‌లు గుట్టుగా నగరానికి వచ్చి పేద పిల్లలను వివాహం పేరిట మోసగిస్తున్న ఘటనలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఈ షాదీల వెనుక కీలక పాత్ర వహిస్తున్న ఖాజీలను నియంత్రించేందుకు.. పెళ్లి చేసుకునే వరుడు, వధువు ఆధార్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. గతంలో మాదిరిగా ఖాజీలు ఏదో ఒక దస్తావేజు తీసుకొని పెళ్లి చేయడానికి వీలు లేదని తేల్చిచెప్పింది. ఆధార్ నమోదైన వివరాలకు అనుగుణంగా మైనరా? మేజర్? అనే విషయాన్ని నిర్దేశించుకోవాలని.. పెళ్లిళ్ల వివరాలను వక్ఫ్ బోర్డు కార్యాలయంలో అందజేయాలని సూచించింది. మైనర్, కాంట్రాక్ట్ పెళ్లి చేసే ఖాజీలపై చట్టరీత్యా చర్యలు తప్పవని హుకుం జారీ చేసింది. మరోవైపు గతంలో మాదిరిగా ఖాజీల నియామకం నేరుగా మైనార్టీ సంక్షేమ శాఖ చేయదు. జిల్లా కలెక్టర్‌లు ఖాజీలకు సంబంధించి వివరాలన్ని పరిశీలించిన అనంతరం వచ్చే ప్రతిపాదనల ఆధారంగా ఖాజీల నియామకం చేయాలని ఆదేశించింది.
మ్యారేజ్ సర్టిఫికెట్లూ ఆన్‌లైన్‌లోనే..
షాదీకి సంబంధిచిన సరి్టఫికెట్లను ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చు. పెళ్లి సర్టిఫికెట్ కోసం ప్రస్తుతం అన్ని వ్యవహారాలు రాతపూర్వకంగానే జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లి ఎక్కుడ జరిగినా మ్యారేజ్ సర్టిఫికెట్లకు హైదరాబాద్ హజ్‌హౌస్‌లోని నాజిరుల్ ఖజాత్ కార్యాలయానికి రావాల్సి వస్తుంది. ఆన్‌లైన్ సర్టిఫికెట్‌కు పెళ్లి సందర్భంగా ఇచ్చే పెళ్లి పుస్తకం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. దరఖాస్తు ఆన్‌లైన్‌లో అందిన తర్వాత అధికారులు తమ వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లో పెడతారు. ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభమైతే దేశంలో ఎక్కడ నుంచైనా మ్యారేజ్ సర్టిఫికెట్ డోన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
దేశంలోనే తొలిసారిగా..
దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ముస్లింల షాదీ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదవుతున్నాయి. గతంలో జరిగిన వాటితో పాటు ప్రస్తుతం జరుగుతున్న ప్రతి షాదీనీ వక్ఫ్ బోర్డు కార్యాలయలయంలో నమోదు చేస్తున్నారు. దీంతో మోసాలను కట్టడి చేసేందుకు వీలు ఉంటుంది.
– ఎండీ మసీవుల్లా ఖాన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment