శనివారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్ ముందు యూఎస్‌పీపీ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు హాజరైన కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఉపాధ్యాయ సంఘం నాయకులు
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు కదం తొక్కాయి. జీఓలోని లోపాలను సవరించాలని, స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆందోళనకు దిగాయి. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయులు ధర్నాలు చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
హక్కులను కాలరాసే జీవో
ప్రభుత్వం 317 జీవో ద్వారా ఉపాధ్యాయుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ఎలాంటి సం ప్రదింపుల్లేకుండా జీవోను అమలు చేయడం ఘోరమన్నారు. ఉద్యోగులపై ప్రభుత్వ వైఖరి పాలేరు తీరులా ఉందని విమర్శించారు. జీవోను సవరించాలంటూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు.
సొంత జిల్లాలో ఉద్యోగం చేసేందుకు అవకాశం లేకుండా జీవో ఉందని కోదండరాం విమర్శించారు. జిల్లాల వారీగా పెద్ద మొత్తంలో ఖాళీలున్నాయని, ఉద్యోగులను సొంత జిల్లాలకు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఒంటరి మహిళలు, వికలాంగులకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి న్యాయం చేయాలని కోరారు.
కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఆందోళనలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
నల్లగొండ కలెక్టరేట్ ఎదుట నిరసన..
నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు
హైదరాబాద్‌లో టీచర్ల ఆందోళన
జిల్లాల్లో ఆందోళనలు ఇలా..
♦నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయాల ముందు ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. నిజామాబాద్‌లో కలెక్టర్ నారాయణ రెడ్డికి, కామారెడ్డిలో కలెక్టర్ కార్యాలయ ఏవోకు వినతిపతం సమర్పించారు. బాన్సువాడలో ఉపాధ్యాయుల సంతకాల సేకరణ చేపట్టారు.
♦కరీంనగర్ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చలో కలెక్టరేట్ నిర్వహించారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు.
♦రంగారెడ్డి కలెక్టరేట్, వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఉద్యోగుల అభ్యంతరాలను పట్టించుకోకుండా కేటాయింపులు జరపడంతో పలువురు శాశ్వతంగా స్థానికతను కోల్పోయారని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ దామాషాలను ఒక్కో జిల్లాలో ఒక్కోలా పాటించారన్నారు.
♦హనుమకొండ, మహబూబాబాద్, జనగామ కలెక్టరేట్ల ఎదుట ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. హనుమకొండలో జరిగిన నిరసనలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పాల్గొన్నారు.
♦సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు అశోక్ కుమార్ నేతృత్వంలో నిరసన తెలిపారు. మెదక్‌లో కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన తెలిపి అదనపు కలెక్టర్ రమేశ్‌కు వినతిపత్రం అందజేశారు.
♦ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టరేట్ల వద్ద టీచర్లు ఆందోళన చేపట్టారు. సమస్యల పరిష్కారం కోసం చేసిన అప్పీళ్లను కూడా పరిశీలించడం లేదని విమర్శించారు.
♦ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ల ఎదుట కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట కలెక్టరేట్ల ఎదుట టీచర్లు ధర్నా చేశారు. యూటీఎఫ్‌తో పాటు టీఈజేఎస్, కాంగ్రెస్, సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు.
♦ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్, డీఈఓ కార్యాలయాల వద్ద ఉపాధ్యాయులు ఆందోళనలు నిర్వహించారు. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment