మంగళవారం సచివాలయంలో టీఎస్‌పీఎస్సీపై ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డీజీపీ రవి గుప్తా, సీఎస్ శాంతికుమారి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి ఇప్పటికే రాజీనామా చేయడం, ఐదుగురు సభ్యులు కూడా ఒకటీ రెండురోజుల్లో గవర్నర్‌ను కలిసి రాజీనామాలు సమర్పించే అవకాశమున్న నేపథ్యంలో కమిషన్ నిర్వహించాల్సిన పరీక్షలు అనివార్యంగా ఆలస్యం కానున్నాయి. టీఎస్‌పీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి లీకేజీలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారు.
అయితే కొత్త చైర్మన్‌ను, సభ్యులను నియమించాల్సి ఉండటం, అందుకు సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రూప్–1 (మెయిన్స్), గ్రూప్–2, గ్రూపు–3లతో పాటు సంక్షేమ అధికారి పరీక్షలు ఆలస్యం అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. టీఎస్‌పీఎస్సీపై ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త కమిషన్ ఆధ్వర్యంలో పూర్తి పారదర్శకంగా పరీక్షల నిర్వహణ ద్వారా నిరుద్యోగుల్లో ఆత్మవిశ్వాసం నింపేలా చర్యలకు ఉపక్రమించారు.
నూతన కమిషన్ ఏర్పాటు, చైర్మన్, సభ్యుల నియామకానికి సంబంధించిన నిబంధనలు, కమిషన్ కార్యాచరణ తదితరాలపై అధికారులతో చర్చించారు. సీఎస్ శాంతికుమారి, సీఎం కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవిగుప్తా, అదనపు డీజీ సీవీ ఆనంద్, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్, ఆర్థిక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి సంబంధించిన కేసును విచారిస్తున్న సిట్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇతర రాష్ట్రాల్లో ఎలా నిర్వహిస్తున్నారో తెలుసుకోండి
టీఎస్‌పీఎస్సీ ద్వారా చేపడుతున్న నియామకాలు, జారీ చేసిన నోటిఫికేషన్లు, నిర్వహించిన పరీక్షలు, మిగతా పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివరాలను సీఎం రేవంత్‌రెడ్డి.. కమిషన్ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
యూపీఎస్సీకి, ఇతర రాష్ట్రాలకు ఉన్నతాధికారుల బృందాన్ని పంపి అక్కడి నియామకాల ప్రక్రియపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించించాలని సూచించారు. కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తగు నిబంధనలు రూపొందించాలని ఆదేశించారు.
కమిషన్‌కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, కావాల్సిన సిబ్బందిని, ఇతర సదుపాయాలను వెంటనే కల్పించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో కమిషన్‌ను సమూల ప్రక్షాళన చేయాలని సీఎం నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం కమిషన్ ఉద్యోగులు ఎవరెవరికి ఏయే బాధ్యతలున్నాయి? మార్పులు చేర్పులు, ఖాళీలు, కొత్తగా ఉద్యోగాల భర్తీ తదితరాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై నమోదైన కేసు, దర్యాప్తు పురోగతిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. దర్యాప్తును వేగవంతం చేయాలని సిట్‌ను ఆదేశించినట్లు తెలిసింది.
కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ మేరకు పరీక్షలు!
గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన నోటిఫికేషన్లకు అనుగుణంగా వివిధ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించారు. గ్రూప్–1(మెయిన్స్), గ్రూప్–2, గ్రూప్–3, హెచ్‌డబ్ల్యూఓ, లెక్చరర్ కొలువులకు సంబంధించి పరీక్షలు నిర్వహించలేదు. మరోవైపు పరీక్షలు నిర్వహించిన వాటికి వివిధ కారణాల వల్ల ఫలితాలను వెల్లడించలేదు.
తాజాగా టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి పూనుకోవడం, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగా ఉద్యోగ అర్హత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఆయా పరీక్షల నిర్వహణకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని టీఎస్‌పీఎస్సీ వర్గాలు వివరిస్తున్నాయి.
సీఎంను కలిసిన కమిషన్ సభ్యులు
టీఎస్‌పీఎస్సీ సభ్యులు కారం రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ, బి.లింగారెడ్డి, సుమిత్రా ఆనంద్ తనోబా, కోట్ల అరుణ మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. చైర్మన్ రాజీనామా నేపథ్యంలో తాము కూడా రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సాయంత్రమే గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలిసేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లారు.
కానీ గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఆమె వచ్చిన తర్వాత బుధ, గురువారాల్లో రాజీనామా లేఖలు సమర్పించాలని నిర్ణయించుకున్నారు. కాగా సభ్యుడు ఆర్.సత్యనారాయణ రాష్ట్ర నిరుద్యోగులను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ఎలాంటి పొరపాటు చేయనప్పటికీ సభ్యుడి హోదా నుంచి తప్పుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment