ఖమ్మం: సాధారణంగా ఏ ఎన్నికల్లోన్నైనా పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉంటారు. వారి ఓట్లను రాబట్టుకునేందుకు నేతలంతా హామీల వర్షం గుప్పిస్తుంటారు. కానీ.. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పురుష ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. దీంతో జిల్లాలో అభ్యర్థుల గెలుపోటములపై పురుష ఓటర్లు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. జిల్లాలోని 21 మండలాల్లో 87,172 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పురుషులు వేసే ఓట్లే ప్రధానంగా కీలక భూమిక పోషించనున్నాయి. అభ్యర్థులు కూడా తమ వ్యూహ రచనల్లో భాగంగా పురుష, మహిళా ఓటర్లతోపాటు వయసుల వారీగా కూడా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా యువత ఓట్లను రాబట్టుకునేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
ఇప్పటివరకు మహిళలదే సత్తా..
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నుంచి మొదలుకుంటే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీల అభ్యర్థులు మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకొని ఓట్లు అడిగేవారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాల గురించి.. వారి కోసం చేయనున్న అభివద్ధి పనుల గురించి వివరించి.. వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలను ముమ్మరం చేసేవారు. అయితే తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో వారిని ఎలా కలుసుకోవాలనే దానిపై కూడా అభ్యర్థులు ఆలోచనలు చేస్తూ ప్రణాళిక రూపొందిస్తున్నారు. మహిళలను ఇంటి వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించవచ్చు. అయితే పురుష ఓటర్లు ఎక్కువగా ఉండటం.. వారు పట్టభద్రులు కావడంతో ఎక్కువ మంది ఏదో ఒక ఉద్యోగం చేస్తూ వేర్వేరు ప్రాంతాల్లో ఉంటారు. దీంతో వారిని కలుసుకోవడం కొంత ఇబ్బందికరంగానే ఉంటుందని బరిలో నిలిచిన అభ్యర్థులు ఆలోచిస్తున్నారు. ఓట్లను అభ్యర్థించడానికి ఇళ్లకు వెళ్లడం కన్నా.. అంతర్గత సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడంపైనే ఇప్పటివరకు అభ్యర్థులు దష్టి సారించారు. ఇక మున్ముందు ఇళ్లను సందర్శించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే ఓటర్ల వివరాలను సేకరిస్తూ పోటీలో ఉన్న అభ్యర్థులు వారి వివరాలతో సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు పంపుతూ తమకే ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. అలాగే ఓటు వేసే వ్యక్తి పేరు, ఓటరు సీరియల్ నంబర్, పోలింగ్ బూత్ నంబర్ తదితర వివరాలను పూర్తిగా పంపుతూ వారు ఓటు వేసేలా చైతన్యపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment