సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు గురుకులాలు ముందస్తు కసరత్తు చేపట్టాయి. ఈ నెలాఖరులోగా అన్ని తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించాయి. ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించే దరఖాస్తు ప్రక్రియకు ఇరవై రోజులపాటు గడువు ఇవ్వనున్నాయి.
సాధారణంగా ఫిబ్రవరి చివరివారం నుంచి ఏప్రిల్ రెండోవారం వరకు ప్రవేశాల నోటిఫికేషన్లు జారీ చేస్తుండగా, ఆగస్టు రెండోవారం నాటికి అడ్మిషన్ల ప్రక్రియ ముగిసేది. అయితే రెండేళ్లుగా కోవిడ్ కారణంగా ప్రవేశాల ప్రక్రియ గాడితప్పుతోంది. 2021–22 సంవత్సరానికి డిసెంబర్ వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగింది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యే నాటికే వందశాతం అడ్మిషన్లు పూర్తి చేసేలా గురుకులాల సొసైటీలు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి.
ఐదో తరగతికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలతోపాటు విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుకుల సొసైటీలున్నాయి. ఐదో తరగతి ప్రవేశాలకు మైనార్టీ సొసైటీ మినహా మిగతా నాలుగు గురుకులాలు ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించనున్నాయి. ఈ మేరకు ఒకే నోటిఫికేషన్ వెలువడనుంది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకున్న ఖాళీలను భర్తీ చేసేందుకు సొసైటీలవారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తారు.
జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్లకు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు ఇస్తాయి. ఎస్సీ, ఎస్టీ గురుకులాల పరిధిలోని సైనిక పాఠ శాలలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో అడ్మిషన్లకు కూడా ప్రత్యేక నోటిఫికేషన్లు వెలువడ నున్నాయి. ఇవన్నీ ఈ నెలాఖరులోగా జారీ చేసేం దుకు గురుకుల సొసైటీలు చర్యలు వేగవంతం చేశాయి.
ముందంజలో ఎస్సీ గురుకుల సొసైటీ...
ఎస్సీ గురుకుల సొసైటీ ఇప్పటికే డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి టీజీయూజీసెట్–2022 నోటిఫికేషన్ జారీ చేసి, ఈ నెల 23న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. జూనియర్ కాలేజీలు, సీఓఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ)ల పరిధిలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ ప్రవేశాలకు టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ అండ్ సీఓఈసెట్–2022 నోటిఫికేషన్ జారీ అయింది.
ఈ నెల 6 నుంచి 25వ తేదీ వరకు సొసైటీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 20న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు సొసైటీ వెల్లడించింది. మిగతా సొసైటీలు కూడా త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment