ఆ నిధులు తెండి: హరీష్‌ రావు | Telangana: Harish Rao Slams Central Govt Over Funds Allocation | Sakshi
Sakshi News home page

ఆ నిధులు తెండి: హరీష్‌ రావు

Published Thu, Feb 9 2023 1:16 AM | Last Updated on Thu, Feb 9 2023 4:19 AM

Telangana: Harish Rao Slams Central Govt Over Funds Allocation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకవైపు రాష్ట్ర రుణాలకు కోతపెడుతూ.. మరోవైపు రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులను ఇవ్వకుండా అడ్డుకుంటోందని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రస్తుత సంవత్సరమే రాష్ట్రానికి రూ. 37,809 కోట్లను ఎగ్గొట్టిందని, అలాగే, నీతి ఆయోగ్‌ సిఫారసుల మేరకు మిషన్‌ భగీరథకు ఇవ్వాల్సిన రూ.19,205 కోట్లకు ఎగనామం పెట్టిందన్నారు. ఇలా కేంద్రం నుంచి మొత్తం రూ.1,27,109 కోట్లు రావాల్సి ఉందని స్పష్టంచేశారు. బీజేపీ ఎమ్మెల్యేలకు రాష్ట్రంపై ప్రేమ ఉంటే ఈ మొత్తం నిధులను తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

‘ఏడాదిలో విద్యుత్‌ కోతలు లేకుండా చేస్తామని 2014లో సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తే, కాంగ్రెస్‌ పక్ష నేత జానారెడ్డి ఆశ్చర్యంగా ఉందన్నారు. అలా చేస్తే తాను గులాబీ జెండా పట్టుకుని ప్రచారం చేస్తానన్నారు. ఇప్పుడు నాణ్యమైన కరెంట్‌ 24 గంటలూ ఇస్తున్నాం. విద్యుత్‌ కోత అన్న మాటే లేకుండా చేశాం. పవర్‌ ఇచ్చాం కాబట్టే ప్రజలు మాకు పవర్‌ ఇచ్చారు.. విపక్షాలకు పవర్‌ లేకుండా చేశారు’ అని హరీశ్‌రావు చెప్పారు. శాసనసభలో బుధవారం రాష్ట్ర బడ్జెట్‌ 2023–24పై జరిగిన సాధారణ చర్చలో సభ్యులు లేవనెత్తిన అంశాలకు ఆయన సమాధానమిచ్చారు. హరీశ్‌రావు ప్రసంగం ఆయన మాటల్లోనే..

డబుల్‌ ఇంపాక్ట్‌ బాగుందా.. డబుల్‌ ఇంజన్‌ బాగుందా?
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేశాం. రాజకీయ దురుద్దేశంతోనే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలి. గొంతు తడుపుకొనేందుకు గుక్కెడు నీళ్లు కూడా లేక ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. బడ్జెట్‌ సమావేశాలొస్తే ఖాళీ బిందెల ప్రదర్శనలు జరిగేవి. మిషన్‌ భగీరథ ద్వారా నీళ్ల సమస్యే లేకుండా చేసిన ఘనత మా ప్రభుత్వానిదే. ఈ పథకాన్ని కేంద్రం కాపీ కొట్టినా, ముందుకు తీసుకెళ్లలేకపోతోంది. డబుల్‌ ఇంపాక్ట్‌ సర్కార్‌ బాగుందా.. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం బాగుందా (కేంద్రాన్ని ఉద్దేశించి). 

రాష్ట్ర అప్పులు తగ్గుదల 
జీఎస్డీపీ (రాష్ట్ర స్థూలజాతీయోత్పత్తి)లో ఎంత శాతం ఉందని చూడటమే అప్పులకు కొలమానం. గతేడాది జీఎస్డీపీలో 24.7గా ఉన్న అప్పుల శాతాన్ని ఈ ఏడాది 23.8 శాతానికి తగ్గిస్తున్నాం. పెరిగిన జీఎస్డీపీని బట్టి రుణాలను సమీకరిస్తున్నాం. రాష్ట్రాల అప్పులు తగ్గుతుంటే కేంద్రం అప్పులు పెరుగుతున్నాయి. కేంద్ర అప్పులు రూ.160 లక్షల కోట్లకు పెరగగా, ఒక్కో పౌరుడిపై రూ.1,39,956 అప్పు భారాన్ని మోపింది. గతేడాది దేశ జీడీపీలో 55.9 శాతం ఉన్న కేంద్ర ప్రభుత్వ అప్పులు ఈ ఏడాది 56.2 శాతానికి పెరిగాయి. కేంద్రం తెచ్చే అప్పుల్లో 48.7 శాతాన్ని రోజు వారీ ఖర్చులు, అప్పు కట్టడానికే సరిపోతోంది. ఎఫ్‌ఆర్‌బీఎం సంస్కరణల పేరుతో గతేడాది రూ.15,033 కోట్ల రాష్ట్ర రుణాలకు కోత పెట్టిన కేంద్రం.. తాను మాత్రం యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతోంది. 

కార్పొరేట్లకు దోచిపెట్టుడే..
బీజేపీ అంత్యోదయ సిద్ధాంతానికి నీళ్లొదిలింది. అదానీ సిద్ధాంతాన్ని అమలు చేస్తోంది. చిట్టచివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందించాలన్నదే అంత్యోదయ సిద్ధాంతం. కానీ, బీజేపీ వాళ్లకు పేదల సంక్షేమం వద్దు, కార్పొరేట్లకు దోచిపెట్టుడే ముద్దు. గత ఆరేళ్లలో కార్పొరేట్లకు చెందిన రూ.19 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేసిన కేంద్రం.. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్లాలు కట్టడాన్ని ఆక్షేపించింది. దీనికోసం ఖర్చుచేసిన రూ.151 కోట్లను తిరిగి ఇచ్చేదాకా రాష్ట్రానికి ఉపాధి హామీ నిధులను కూడా ఆపేసింది. రైతులపై కార్లెక్కించిన బీజేపీ నేతలు రైతుల గురించి మాట్లాడటం విడ్దూరంగా ఉంది. 
 
 కేంద్రం నుంచి రావాల్సినవి 
‘15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన రూ.5,374 కోట్ల స్టేట్‌ స్పెసిఫిక్‌ గ్రాంట్, 2022–23 ఫైనాన్స్‌ కమిషన్‌ బకాయిలు రూ.2,016 కోట్లు, జీఎస్టీ పరిహారం రూ.2,437 కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రూ.5వేల కోట్లు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు రూ.1,350 కోట్లు, మిషన్‌ కాకతీయకు రూ.5 వేల కోట్లను ఇవ్వకుండా కేంద్రం అడ్డుపడుతోంది’ అని హరీశ్‌రావు చెప్పారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టనందుకు 2021–26 మధ్య కాలంలో రూ.30 వేల కోట్లు (ఏటా సుమారు రూ..6వేల కోట్లు) ఆపేసిందన్నారు. ఏపీ నుంచి రావాల్సిన రూ.17,800 కోట్ల విద్యుత్‌ బకాయిలు, పొరపాటున ఏపీకి వెళ్లిన రూ.495 కోట్ల రాష్ట్ర నిధులను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అన్నీ కలిపి రాష్ట్రానికి రూ.1,27,109 కోట్లు రావాల్సి ఉందన్నారు. 

నిండుకుండల్లా చెరువులు  
► మిషన్‌ కాకతీయ వల్ల ఎండిపోయిన చెరువులు నిండుకుండల్లా ఉన్నాయి. భూగర్భ జలమట్టం పెరిగింది. బోరు వెయ్యకుండానే నీళ్లు రావడం మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడలో చూశాను. ఎండాకాలంలోనూ చెరువులు పొంగుతున్నాయి. చెక్‌డ్యాంలు అలుగుపారుతున్నాయి. 500 ఏళ్లలో పడనంత వాన వచి్చనా చెరువుల కట్టలు తెగలేదు.  
► ప్రాజెక్టులు కడుతుంటే విపక్షాలు అడ్డుపడుతున్నాయి. కేసులు వేస్తున్నాయి. క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాయి. ఎవరు అడ్డుపడ్డా పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం.  
► కృష్ణానది జలాల వాటా సాధన కోసం అనేక ప్రయత్నాలు చేశాం. కేంద్రం పరిష్కరిస్తామంటేనే సుప్రీంకోర్టులో వేసిన కేసునూ ఉపసంహరించుకున్నాం. పది నెలలైనా పరిష్కరించలేదు. కొద్ది రోజులు చూసి మళ్లీ కోర్టుకెళ్తాం. 
► మహారాష్ట్ర రైతులు తెలంగాణ సరిహద్దుల్లో భూమి కొనుక్కుని, ఇక్కడ్నుంచీ బోర్‌ ద్వారా నీళ్లు పారించుకుంటున్నారు. మన కరెంట్‌తో కర్ణాటక సరిహద్దుల్లోనూ నీళ్లు పారుతున్నాయి.  
► రైతు ఆత్మహత్యల స్థాయి నుంచి ఆత్మ గౌరవం స్థాయికి తెచ్చాం. జీఎస్డీపీలో 18.2 శాతం ఆదాయం వ్యవసాయం నుంచే వస్తోంది. రైతుకు అన్ని దశల్లోనూ అండగా ఉంటున్నాం.   

నాడు మీరు చెప్పిందే వినిపిస్తున్నా..:
‘ఈ రాష్ట్రం పరువు తీయడం కాదు.. ఆ సూచనలేవో కేంద్రానికి చెప్పండి’ అని గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్‌ బీజేపీ సభ్యులను ఉద్దేశించి అన్న మాటలను హరీశ్‌రావు బుధవారం అసెంబ్లీలో ట్యాబ్‌ ద్వారా సభ్యులకు ప్రదర్శించారు. అనంతరం ‘నాటి మీ మాటలను గుర్తుచేస్తున్నా.. అదే నేనూ చెబుతున్నా. అదేదో కేంద్రానికి చెప్పండి’ అని ఈటలను ఉద్దేశించి అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement