హైదరాబాద్/ ఢిల్లీ, సాక్షి: తెలంగాణ సర్పంచ్‌లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రేపటి నుంచి తమ స్థానంలో ప్రత్యేక అధికారులు బాధ్యత తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తే కోర్టును స్టే కోరారు వాళ్లు. అయితే.. అందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. పిటిషన్ తదుపరి విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది.
తెలంగాణలో సర్పంచుల పదవీకాలం నేటితో ముగియనుంది. వాళ్ల స్థానంలో స్పెషల్ ఆఫీసర్లను(శిక్షణతో సహా) నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. అయితే ఎన్నికలు జరిగేంత వరకు తమ పదవీకాలం పొడిగించాలని సర్పంచ్‌లు విజ‍్క్షప్తి చేయగా.. ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ప్రత్యేక అధికారులను నియమించకుండా సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సర్పంచులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఒకవేళ ఎన్నికల నిర్వహించడం కుదరకపోతే తమ పదవీ కాలాన్ని పొడిగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అలాగే.. ప్రత్యేక అధికారుల నియామకంపై స్టే ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి: డ్యూటీ ఎక్కకముందే స్పెషల్ ఆఫీసర్లకు వార్నింగులా?
ఇక రేపటి నుంచి ప్రత్యేక అధికారులు రంగంలోకి దిగతుండడంతో.. ఇవాళే అన్ని గ్రామ పంచాయితీలలో హడావిడి నెలకొంది. జనరల్ బాడీ సమావేశాలు పెట్టి.. హుటాహుటిన పెండింగ్ అంశాలపై చర్చించి ఆమోదం తెలుపుకుంటున్నాయి ఆ గ్రామ పంచాయితీలు. ఇప్పటికే వాళ్ల వద్ద ఉన్న రికార్డులను, స్టాంప్స్ అండ్ లెటర్ ప్యాడ్స్ సరెండర్ చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి.
దీంతో.. రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్స్ అధీనంలోకి గ్రామ పంచాయితీలు వెళ్లనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల లోపు అన్ని గ్రామ పంచాయితీలలో ఛార్జ్ తీసుకోనున్నారు ప్రత్యేక అధికారులు. ఇప్పటి వరకు సర్పంచ్ ఉపసర్పంచ్ లకు జాయింట్ గా చెక్ పవర్స్ ఉండగా.. రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్ - విలేజ్ సెక్రెటరీకి ఆ పవర్ బదిలీ అవుతుంది. ఇక.. ఎల్లుండి(ఫిబ్రవరి 2వ తేదీ) స్పెషల్ ఆఫీసర్స్ తో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తిరిగి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేంతవరకు పంచాయితీలన్నీ వీళ్ల పర్యవేక్షణలోనే పని చేస్తాయి.
కిషన్‌రెడ్డి అభ్యంతరం
ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించడం రాజ్యాంగానికి విరుద్ధమని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి. ఢిల్లీలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో స్పెషల్ ఆఫీసర్ల తో గ్రామ పంచాయితీల పాలన రాజ్యాంగానికి విరుద్ధం. ఎన్నికలు నిర్వహించలేకపోతే ఇప్పుడున్న సర్పంచులనే కొనసాగించాలి. గ్రామ పంచాయితీలు లేకుంటే గ్రామ సభలు ఎలా పెడతారు?. లబ్ధిదారుల ఎంపికకు గ్రామ సభలనేవి తప్పనిసరి. ఎన్నికల లోపే గ్రామ సభల్లో లబ్ధి దారుల ఎంపిక పూర్తి చేసి ఆరు గ్యారంటీలు అమలు చేయాలి’’ అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన.
Comments
Please login to add a commentAdd a comment