సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన చట్టం మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఐడీసీఎల్) ఫిక్స్‌డ్ డిపాజిట్లను డ్రా చేసుకుంటోందంటూ తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌ఐడీసీఎల్) దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఏపీకి రావాల్సిన 58 శాతంకన్నా ఎక్కువ మొత్తాన్ని డ్రా చేసుకోరాదని ఆదేశించింది.
ఉమ్మడి కార్పొరేషన్‌కు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఏపీకి రావాల్సిన 58 శాతంకన్నా ఎక్కువ మొత్తాన్ని డ్రా చేసుకుంటున్నారంటూ టీఎస్‌ఐడీసీఎల్ ఎండీ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఏపీఐడీసీఎల్ వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఈ తీర్పు ప్రకారం ఉమ్మడి సంస్థల నిధులను 58, 42 శాతం నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉందన్నారు. 58 శాతానికి మించి ఏపీఐడీసీఎల్ డ్రా చేసుకోదని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీఐడీసీఎల్ చైర్మన్/ఎండీ, కెనరా బ్యాంక్, ఎస్‌బీఐలను ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 3కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment