సాక్షి, హైదరాబాద్: రానున్న వినాయకచవితిని పురస్కరించుకొని గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు పలు సూచనలు చేసింది. గణేశ్ మండపాల ఏర్పాటు మొదలు నిమజ్జనం వరకు నియంత్రణ చర్యలుండాలని, ఈ మేరకు ఆంక్షలు విధించాలని సూచించింది. మండపాలలో ఏర్పాటు చేసే లౌడ్‌స్పీకర్లతో శబ్దకాలుష్యం, విగ్రహాల నిమజ్జనం కారణంగా ఏర్పడే జలకాలుష్యంతో ఇతరులు ఇబ్బందిపడతారని, ఒకరి మతవిశ్వాసాల కోసం ఇంకొకరిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదని తేల్చిచెప్పింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, మండపాల దగ్గర, నిమజ్జనం సమయంలో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
గ్రేటర్ హైదరాబాద్‌లో విగ్రహాల నిమజ్జనం ఎక్కడికక్కడ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై గతంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం లేదంటూ న్యాయవాది ఎం.వేణుమాధవ్ దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ‘భక్తులను నియంత్రించడం అంత సులభమేమీ కాదని మాకు కూడా తెలుసు, అయినా కోర్టు ఆదేశాలను చూపించి నియంత్రణ చర్యలు చేపట్టాలి’అని సూచించింది. మండపాల ఏర్పాటు మొదలు నిమజ్జనం వరకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ సమగ్ర నివేదిక సమర్పించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ), పీసీబీ, గణేశ్ ఉత్సవ సమితి, పిటిషనర్లను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 6కు వాయిదా వేసింది.
50 వేల విగ్రహాలు ఎలా సరిపోతాయి ?
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 50 వేల ఉచిత గణేశ్ మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరీందర్ హైకోర్టుకు నివేదించారు. ఎవరికి వారు ఇంట్లోనే మట్టి వినాయకులను నిమజ్జనం చేసుకోవాలని సూచిస్తున్నామని తెలిపారు. ‘జంటనగరాల జనాభా ఎంత, మీరిచ్చే 50 వేల ఉచిత విగ్రహాలు ఎలా సరిపోతాయి, విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశాం, మన బాధ్యత అయిపోయిందని అనుకుంటే ఎలా’అని ధర్మాసనం ప్రశ్నించింది.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో భారీ విగ్రహాలు ఏర్పాటు చేయకుండా, మట్టివిగ్రహాలను ఏర్పాటు చేసేలా చూడాలని, సహజ రంగులనే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. అన్ని విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకుండా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 16 ప్రత్యేక నీటికొలనులను నిర్మించారని, అయినా వాటిని వినియోగించుకోకుండా మెజారిటీ విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేస్తున్నారని తెలిపారు.
పీసీబీ ఏం చేస్తోంది ?
‘హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అనేక సూచనలు చేసింది. వాటి అమలు తీరును పర్యవేక్షించడం మరిచింది. పీసీబీ సూచనలను ఇతర విభాగాల అధికారులు పాటించకపోతే వారిపైనా చర్యలు తీసుకోవచ్చు. అయినా ఎందుకు మౌనంగా ఉంటోంది’’అని పీసీబీ తరఫున హాజరైన న్యాయవాది శివకుమార్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. హుస్సేన్‌సాగర్ ఒకప్పుడు కాలుష్య రహితంగా ఉండేదని, నిమజ్జనంతో కాలుష్య కాసారంగా మారిందని పేర్కొన్నారు. మండపాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చే సమయంలోనే సమీపంలోని చెరువుల్లో నిమజ్జనం చేసేలా నిర్వాహకులకు తెలియజేయాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment