సీఈవో ఆఫ్ ద ఇయర్ అవార్డును అడోబ్ సంస్థ సీఈవో శంతను నారాయణన్‌కు అందిస్తున్న మంట్రి కేటీఆర్. చిత్రంలో జయేశ్ రంజన్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర భారతదేశంలో విజయవంతమైన తొలి స్టార్టప్ రాష్ట్రం తెలంగాణ అని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అభివర్ణించారు. విధానాల రూపకల్పన మొదలుకొని ఔత్సాహిక ప్రారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా ప్రోత్సా హం అందించే వాతావరణాన్ని కల్పించే వరకూ తెలంగాణ ఒక స్టార్టప్ కంపెనీ మాదిరిగానే ఆలోచిస్తుందని పేర్కొన్నారు.
ద ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ ప్రపంచస్థాయి శిఖరాగ్ర సదస్సు (టై గ్లోబల్ సమ్మిట్ –2022) ఏడో సమావేశం ప్రారంభానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి దేశంలోనే అత్యద్భుతమైన నగరంగా హైదరాబాద్ ఎదిగిందన్నారు. టీ–హబ్, వీ–హబ్, టీ–వర్క్స్, రిచ్, టాస్క్, ఇమేజ్, నైకామ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం వంటి సంస్థల ఏర్పాటు ద్వారా ఈ వాతావరణాన్ని కల్పించామని తెలిపారు.
ఈ ఏడాది జూన్‌లో ప్రపంచంలోనే అతిపెద్దదైన 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణమున్న టీ–హబ్ 2.0ను ప్రారంభించామని గుర్తు చేశారు. ఏడేళ్ల కాలంలో టీ–హబ్ 1,100 మంది ఎంట్రప్రెన్యూర్లకు మద్దతిచ్చిందని, 190 కోట్ల డాలర్ల మేరకు నిధులు సమీకరించేందుకు సాయపడిందని చెప్పారు. ప్రైవేట్ రంగంలో తొలి రాకెట్‌ను తయారు చేసిన స్కైరూట్, మూడు నానో ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చిన ధ్రువ స్పేస్ టెక్ కంపెనీలు టీ–హబ్‌లోనే పురుడు పోసుకున్నాయని తెలిపారు.
హైదరాబాద్‌కు విచ్చేయండి...
ప్రపంచంలోని టాప్–20 ఐటీ సంస్థల్లో ఎక్కువ కంపెనీలు హైదరాబాద్‌లో తమ రెండో అతిపెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేశాయని, 6,500కుపైగా స్టార్టప్‌లకు కేంద్రమూ ఈ నగరమేనని కేటీఆర్ తెలిపారు. అడోబ్ లాంటి సంస్థలు కూడా మరింత విస్తృతస్థాయి కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని వేదికపై ఉన్న ఆ సంస్థ సీఈవో, హైదరాబాద్‌లోనే విద్యనభ్యసించిన శంతను నారాయణన్‌ను కోరారు. బెంగళూరు నగరంలో విమానాశ్రయం నుంచి ఐటీ కంపెనీలున్న చోటికి వెళ్లాలంటే ఉండే ట్రాఫిక్ సమస్యలిక్కడ లేవంటూ చమత్కరించారు.
మహిళా ఎంట్రప్రెన్యూర్స్‌కు గ్రాంట్..
దేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు టై గ్లోబల్ సమ్మిట్ అన్ని ఏర్పాట్లు చేసిందని టై గ్లోబల్ ఉపాధ్యక్షుడు, వోక్సీ టెక్నాలజీస్ సీఈవో మురళి బుక్కç³ట్నం తెలిపారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు లక్షల డాలర్లు గ్రాంట్‌గా అందించేలా పోటీ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. పోటీలో సుమారు 40 మంది తమ ఆలోచనలను పెట్టుబడిదారుల ముందు ఉంచారని, వీరిలో ఆరుగురు తుదిదశకు ఎంపిక కాగా.. విజేతగా నిలిచే ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త తమ ఆలోచనతో వ్యాపారం మొదలు పెట్టేందుకు లక్ష డాలర్ల గ్రాంట్ ఇస్తామని వెల్లడించారు.
శంతను నారాయణన్‌కు అవార్డు
టై గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసిన సీఈఓ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఈ ఏడాది అడోబ్ సంస్థ సీఈవో శంతను నారాయణన్‌కు అందిస్తున్నట్లు మురళి బుక్కపట్నం ప్రకటించారు. ఈ సందర్భంగా నారాయణన్ మాట్లాడుతూ.. స్థానిక విద్యారణ్య పాఠశాలలో, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో, ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన చదువులు తన పురోగతికి ఎంతగానో తోడ్పడ్డాయని తెలిపారు. దేశంలోని కాలేజీ విద్య.. ఆలోచించడం ఎలాగో నేర్పిస్తుందని అన్నారు. టై గ్లోబల్ అధ్యక్షుడు బిజే అరుణ్ మాట్లాడుతూ.. గత 30 ఏళ్లలో టై గ్లోబల్ ద్వారా ఏకంగా లక్ష కోట్ల డాలర్ల విలువైన సంపద ఒనగూరిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment