సాక్షి, హైదరాబాద్: కరోనా దడ మళ్లీ మొదలైంది. గురువారం ఒక్కరోజే 12,385 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 122 మందికి కరోనా సోకింది. వీరిలో హైదరాబాద్ వారే 94 మంది ఉన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 0.98 శాతానికి చేరుకుంది. క్రియాశీలక కేసులు 811కు చేరుకున్నాయి. కాగా, థర్డ్‌వేవ్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారీగా నమోదైన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ వేరియంట్‌లోని సబ్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పిలుపునిచ్చింది. మాస్క్‌లు ధరించాలని, భౌతికదూరం పాటించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం కూడా కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సన్నద్ధమైంది. ఏకంగా 2.75 కోట్ల పారాసిటమాల్ మాత్రలను, 17.25 లక్షల ఐసోలేషన్ కిట్లను అందుబాటులో ఉంచింది.
అలాగే 1.81 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను, 2.80 కోట్ల లివోసిట్రజిన్ మాత్రలను, 2 కోట్ల డెక్సమెథజోన్ మాత్రలను, 3.14 కోట్ల డాక్సిసైక్‌లైన్ కేప్సుల్స్‌ను అందుబాటులో ఉంచినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివా సరావు వెల్లడించారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో ఆయన అనేక అంశాలను ప్రస్తావించారు.
అవసరమైన వారికి వెంటనే పరీ క్షలు చేసేందుకు 57.47 లక్షల ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్ కిట్లను సిద్ధం చేశారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం అవుతున్న సమయంలో జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున చర్యలు చేపడుతున్నారు. డెంగీ జ్వరాలు కూడా పెరుగుతున్నాయి. ఏది కరోనా జ్వరమో, ఏది డెంగీ జ్వరమో తెలుసుకునేందుకు టెస్టులను పెంచనున్నారు.
ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్...
వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా సెకండ్, బూస్టర్ డోస్‌లు వేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయిం చింది. 3.06 కోట్ల మందికి రెండో డోస్ వేయగా, బూస్టర్ డోస్ 8.54 లక్షల మందికే వేశారు. ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్‌లను పెంచాలని నిర్ణయించా రు. ప్రస్తుతం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వద్ద 32.27 లక్షల కరోనా డోస్‌లున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో చాలామంది వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావడంలేదు.
ఇక నుంచి ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు. కాగా, తప్పనిసరిగా అధికంగా కరోనా నిర్దారణ పరీక్షలు చేయాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రాలను గురువారం కోరింది. అంతర్జాతీయ ప్రయాణికుల నిర్దేశిత నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని సూచించింది. అయితే రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం విమానాశ్రయంలో ఉన్న రాష్ట్ర వైద్య బృందాన్ని ఇటీవల ఉపసంహరిం చుకోవడం విమర్శలకు తావిస్తోంది.
వ్యాధి తీవ్రత తక్కువే
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఒమిక్రాన్‌కు చెందిన బీఏ.2.12.1, బీఏ.4, బీఏ.5 సబ్ వేరియంట్ల ప్రభావం ఎక్కువగా ఉంది. వీటిలో ఒక ప్రత్యేకమైన ఎల్452ఆర్ జన్యుమార్పు వల్ల వచ్చిన వారికి మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువ. కానీ వ్యాధి తీవ్రత చాలా తక్కువ. వీటితో కేసులు కొంత పెరగవచ్చు కానీ.. ఫోర్త్‌వేవ్‌కు ఇవి కారణం కాబోవు.
– డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ
Comments
Please login to add a commentAdd a comment