1 నుంచి ‘మెడికల్‌’ క్లాసులు  | Telangana: MBBS 1st Year Classes Will Be Start On February First | Sakshi
Sakshi News home page

1 నుంచి ‘మెడికల్‌’ క్లాసులు 

Published Sat, Jan 16 2021 8:35 AM | Last Updated on Sat, Jan 16 2021 8:35 AM

Telangana: MBBS 1st Year Classes Will Be Start On February First - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మొదటి ఏడాది ఎంబీబీఎస్‌ తరగతుల షెడ్యూల్‌ ఖరారైంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసీ) నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్రంలో మొదటి ఏడాది తరగతులు ప్రారంభిస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం నాటికి రాష్ట్రంలో వైద్య విద్య అడ్మిషన్ల ప్రక్రియ ముగుస్తున్నందున కాలేజీలను తెరిచేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని మెడికల్‌ కాలేజీలను విశ్వవిద్యాలయం ఆదేశించింది. అయితే రెండో ఏడాది నుంచి చివరి ఏడాది వరకు వైద్య విద్య తరగతుల ప్రారంభం ఎప్పుడన్నది ఇంకా అధికారికంగా నిర్ణయం జరగలేదు. వాస్తవానికి డిసెంబర్‌ 1 నుంచే తరగతులు నిర్వహించాలని ఎన్‌ఎంసీ రాష్ట్రాలను ఆదేశించింది. దాదాపు 12 రాష్ట్రాల్లో ఆ మేరకు తరగతులు ప్రారంభమయ్యాయి. చదవండి: విక్రమ్‌కు ఎంబీబీఎస్‌ అడ్మిషన్‌ ఇవ్వండి 

కానీ రాష్ట్రంలో తల్లిదండ్రులు ఆసక్తి కనబరచకపోవడం, కరోనా నేపథ్యంలో సర్కారు వెనకడుగు వేయడంతో ఇప్పటివరకు రెండో ఏడాది ఆపై విద్యార్థుల తరగతులను ప్రారంభించలేదు. అయితే 9వ తరగతి నుంచి జూనియర్‌ కాలేజీలు, ఇతర ఉన్నత విద్యకు సంబంధించి కాలేజీలు ఒకటో తేదీ నుంచి తెరుచుకోవడానికి రాష్ట్ర సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ రెండో ఏడాది, ఆపై వైద్య విద్య తరగతుల విషయంపై రాష్ట్ర సర్కారు ఇంకా ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదని కాళోజీ వర్గాలు చెబుతున్నాయి. వెంటనే మెడికల్‌ కాలేజీలు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సర్కారుకు ప్రతిపాదనలు పంపించామని కాళోజీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని చెబుతున్నాయి. ఆయా తరగతులు కూడా మొదటి ఏడాది వైద్య విద్య తరగతులతోనే ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాళోజీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. చదవండి: బుద్ధుడి ధాతువు ఆంధ్రప్రదేశ్‌కే..

మొత్తం 55 వేల మంది విద్యార్థులు... 
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, నర్సింగ్, ఫిజియోథెరపీ సహా ఇతర అన్ని రకాల కాలేజీల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య దాదాపు 55 వేల మంది ఉంటారని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. 33 ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో మొదటి ఏడాది నుంచి చివరి ఏడాది వరకు విద్యార్థుల సంఖ్య 20 వేల మంది వరకు ఉంటారు. మరో 20 వేల మంది నర్సింగ్‌ విద్యార్థులు, 6 వేల మంది డెంటల్‌ విద్యార్థులు, 5 వేల మంది పిజియోథెరపీ విద్యార్థులు, మిగిలినవారు ఆయుష్‌ సహా ఇతరత్రా కోర్సులకు చెందినవారు ఉంటారని తెలిపింది. మొదటి ఏడాది ఎంబీబీఎస్‌ విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 5,040 మంది ఉంటారని విశ్వవిద్యాలయం పేర్కొంది. 

కరోనా టెస్టులు చేశాకే అనుమతి... 
మెడికల్‌ కాలేజీల పునఃప్రారంభం నేపథ్యంలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో కాలేజీలు తెరిచాక పాటించాల్సిన నిబంధనలు, దానికి ముందు చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలు జారీచేసింది. కరోనాతో గతేడాది మార్చి నుంచి మెడికల్‌ కాలేజీలన్నీ మూతబడ్డాయి. అప్పటి నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతున్నాయి. అకడమిక్‌ షెడ్యూల్‌ ప్రకారం అన్ని థియరీ క్లాసులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రాక్టికల్, క్లినికల్‌ క్లాసులు నిర్వహించడానికి, చివరి సంవత్సరం విద్యార్థుల కోసం కాలేజీలను ప్రధానంగా తెరవాల్సి ఉంది. 

మార్గదర్శకాలు ఇవి...
► కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకొని నెగెటివ్‌ రిపోర్ట్‌ ఉన్న వారినే కాలేజీల్లోకి అనుమతించాలి. ఆర్టీ–పీసీఆర్‌ పరీక్ష తప్పనిసరి. 
► జలుబు, దగ్గు, శ్వాస సంబంధ లక్షణాలుంటే కాలేజీలోకి అనుమతించొద్దు. 
► తమ అనుమతితోనే పిల్లలను పంపిస్తున్నట్లు తల్లిదండ్రులు లిఖితపూర్వక లేఖ ఇవ్వాలి.  
► విద్యార్థుల మధ్య కనీసం ఆరడుగుల దూరం పాటించాలి. ఉమ్మివేయడం నిషేధం. 
► కచ్చితంగా మాస్క్‌ ధరించాలి. ఆరోగ్యసేతు యాప్‌ను విద్యార్థులు తమ మొబైల్‌ ఫోన్లలో ఉపయోగించాలి.  
► ప్రతి కాలేజీలో టాస్క్‌ఫోర్స్‌ లేదా ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ టీంను ఏర్పాటు చేసుకోవాలి. 
► రెండు షిఫ్టులుగా లేదా రొటేషన్‌ పద్ధతిలో ప్రాక్టికల్స్, థియరీ తరగతులు నిర్వహించాలి.  
► థియరీ క్లాసులను ఆన్‌లైన్‌ ద్వారా నడిపించడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. కరోనా వ్యాప్తి తగ్గే వరకు దీన్ని కొనసాగించాలి. విద్యార్థులను బ్యాచ్‌లుగా విభజించాలి.  
 హాస్టల్‌ గదుల్లో ఒకరు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలి.  
► మెస్‌లో టైం స్లాట్‌ ప్రకారం విద్యార్థులకు భోజన, అల్పాహారం ఏర్పాట్లు చేయాలి.  
►  విద్యార్థులు ఒకేచోట గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement