సాక్షి, న్యూఢిల్లీ/నల్లగొండ: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో 48 గంటలపాటు పాల్గొనకుండా ఈసీ నిషేధం విధించింది. శనివారం రాత్రి 7 గంటల నుంచి 48 గంటల పాటు జగదీశ్‌రెడ్డి మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, మీడియా భేటీలు, టీవీ ఇంటర్వ్యూల్లో పాల్గొనరాదని ఈసీ స్పష్టం చేసింది.
ఈ మేరకు శనివారం సాయంత్రం ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 25న మంత్రి జి.జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. ‘రాజకీయ పార్టీల మోడల్ ప్రవర్తనా నియమావళి సాధారణ ప్రవర్తన’పార్ట్ 1లోని సబ్ పేరా (4)ని ప్రాథమికంగా ఉల్లంఘించినట్లుగా ఈసీ భావించింది. దీనిపై వివరణ ఇవ్వాలని శుక్రవారం సాయంత్రం మంత్రికి షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.
కాగా శనివారం తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి ద్వారా మంత్రి వివరణను సీఈసీ అందుకుంది. టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థికి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని తను ఎప్పుడూ ప్రసంగించలేదని మంత్రి వివరణ ఇచ్చారు. పథకాలను వివరించే ప్రయత్నం చేశామని.. తను చేసిన ప్రకటన అవినీతి విధానాల నిర్వచనం కిందకు రాదని తెలిపారు.
ఫిర్యాదుదారు, బీజేపీ నాయకుడు కపిలవాయి దిలీప్‌కుమార్ చేసిన ఆరోపణలు కల్పితం, అవాస్తవమన్నారు. అయినా.. జగదీశ్‌రెడ్డి మోడల్ ప్రవర్తనా నియమావళిలోని నిబంధనలను ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది. 48 గంటల పాటు మునుగోడు ఉప ఎన్నికపై ప్రభావం చూపే ఎలాంటి బహిరంగ సభలు, ఊరేగింపులు, ఇంటర్వ్యూలు, మీడియాలో (ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా) బహిరంగంగా మాట్లాడకుండా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఓడిపోతామనే బీజేపీ కుట్రలు..
అంతకుముందు నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారులను కలసి నోటీసుకు వివరణ ఇచ్చిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. బీజేపీ మునుగోడులో ఓడిపోతామన్న భయంతోనే రాజకీయ కుట్రలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆటంకాలు కల్పించడంతో పాటు సర్కారును పడగొట్టడానికి కుతంత్రాలు పన్నిందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment