ఎస్‌ఎంటీ పరిశ్రమ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్, ఎంపీ ప్రభాకర్ రెడ్డి తదితరులు
పటాన్‌చెరు: ‘మేకిన్ ఇండియా వంటి నినాదాలు కాదు.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సమస్యలకు పరిష్కారం చూపాలి. కొత్త పరిశ్రమల స్థాపనలో ఉన్న అవరోధాలను తొలగించాలి’అని కేంద్రంపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ పేరు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వ పాలసీ వైఫల్యాలను ప్రస్తావించారు. హైదరాబాద్ శివారులోని అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో గుండె కవాటాల్లో అమర్చే స్టెంట్‌ల తయారీ పరిశ్రమ సహజానంద మెడికల్ టెక్నాలజీ (ఎస్‌ఎంటీ)ని శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెడికల్ డివైజెస్ ఉత్పాదనకు దేశంలో ప్రోత్సాహం కరువైందన్నారు. వైద్య, ఆరోగ్య ఉపకరణాల తయారీలో మనం వెనుకబడ్డామని చెప్పారు. ‘చైనాతో పోల్చితే ఉత్పాదన రేటు ఇక్కడ ఎక్కువగా ఉందని పారిశ్రామికవేత్తలు ఓ సదస్సులో అన్నారు. ఇక్కడ పరిశ్రమ పెట్టి తయారు చేసే కంటే చైనా నుంచి తెప్పించి ఆ పరికరాలను అమ్మితే ఎక్కువ లాభాలు ఉన్నాయని చెప్పారు’అని గుర్తు చేశారు. ‘నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీ– 2022’ పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకరంగా ఉండాలని కోరారు.
పెట్టుబడికి 50 కంపెనీలు ముందుకు
గుండె కవాటాల్లో అమర్చే స్టెంట్‌లను తయారు చేసే ఎస్‌ఎంటీ.. కోవిడ్ ప్రతికూల పరిస్థితిని తట్టుకొని తమ పరిశ్రమను మూడేళ్లలో ఉత్పాదక స్థాయికి తెచ్చిందని కేటీఆర్ చెప్పారు. 20 ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమను ఏర్పాటు చేశారని, 200 మంది శాస్త్రవేత్తల సహకారంతో స్టెంట్‌లను ఉత్పతి చేయనున్నారని తెలిపారు. ఎస్‌ఎంటీ తయారు చేసే స్టెంట్‌లను 70 దేశాలకు సరఫరా చేస్తారన్నారు.
సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో పెట్టుబడి పెట్టేందుకు 50 కంపెనీలు ముందుకు వచ్చాయని, తాజాగా కొన్ని పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయని తెలిపారు. ఫార్మా, వ్యాక్సిన్ల తయారీకి కేంద్రంగా ఉన్న తెలంగాణ ఇక మెడ్ టెక్‌కు కేంద్రంగా మారనుందన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment