Telangana Minister KTR Meets Central Minister Hardeep Singh Puri - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు పాడ్‌ కార్స్, రోప్‌వేస్‌

Published Thu, Jun 23 2022 5:58 PM | Last Updated on Fri, Jun 24 2022 10:42 AM

Telangana Minister KTR Meets Central Minister Hardeep Singh Puri  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో సరికొత్త ప్రజారవాణా వ్యవస్థను ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో రాష్ట్ర సర్కారు ముందడుగు వేసింది. ఇప్పటికే విజయవంతంగా సాగుతున్న మెట్రోరైలు, సబర్బన్‌ రైలు, ఎంఎంటీఎస్‌లకు తోడు పర్సనల్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం (పీఆర్‌టీ ఎస్‌)ను ప్రవేశపెట్టే విషయంలో హైదరాబాద్‌కు ప్రాధాన్యమివ్వా లని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీతో భేటీ అయి.. ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

పీఆర్‌టీఎస్, రోప్‌వేల ఆవశ్యకత ఉంది     
పెరుగుతున్న జనాభా, ఉపాధి అవకాశాలతో మహానగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో ప్రయాణికుల రవాణా డిమాండ్‌ను తీర్చేందుకు పీఆర్‌టీఎస్‌తో పాటు రోప్‌వే సిస్టం వంటి అధునాతన రవాణా సౌకర్యాల (స్మార్ట్‌ అర్బన్‌ మొబిలిటీ సొల్యూషన్స్‌) కల్పన ఆవశ్యకతను మంత్రి వివరించారు. ఇప్పటికే 69 కిలోమీటర్ల మెట్రో రైల్‌ నెట్‌వర్క్, 46 కి.మీ సబర్బన్‌ సర్వీస్, ఎంఎంటీఎస్‌ ఉన్నాయని, వాటికి అనుసంధానంగా 10కి.మీ మేర పీఆర్‌టీఎస్‌ను తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. పీఆర్‌టీఎస్‌ అలాట్‌మెంట్‌కు సంబంధించిన వివరాలన్నీ (స్టాండర్డ్స్, స్పెసిఫికేషన్స్, లీగల్, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌) తమకు అందించాలని కోరారు. 

కారిడార్‌ కోసం ఉన్నతస్థాయి కమిటీ
రాష్ట్ర అసెంబ్లీ మెట్రో స్టేషన్‌ నుంచి ప్యారడైజ్‌ మెట్రో స్టేషన్‌ వరకు.. 10 కి.మీ పొడవున పీఆర్‌టీఎస్‌ కారిడార్‌ను ప్రతిపాదిస్తున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. ప్రతిపాదిత కారిడార్‌ మెట్రో స్టేషన్లు అయిన అసెంబ్లీ, ప్యారడైజ్, ఖైరతాబాద్‌  స్టేషన్లతో పాటు ఎంఎంటీఎస్‌ స్టేషన్లు అయిన జేమ్స్‌ స్ట్రీట్, ఖైరతా బాద్‌ స్టేషన్లను అనుసంధానం చేస్తుందని వివ రించారు. ఈ కారిడార్‌ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు, డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) కోసం ఇప్పటికే ఇండియన్‌ పోర్ట్‌ రైల్, రోప్‌వే కార్పొ రేషన్‌ లిమిటెడ్‌ (ఐపీఆర్‌ఆర్‌సీఎల్‌)లకు కన్సల్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.

కేంద్ర రో డ్లు, హైవేల మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాల కు అనుగుణంగా ఈ కారిడార్‌ను రూపొందించేం దుకు ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పీఆర్‌టీఎస్‌ పట్ల తెలంగాణ ప్రభుత్వ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ మేరకు అలైన్‌మెంట్‌ కాపీని కేంద్రమంత్రికి అందజేశారు.

మురుగు నీటి శుద్ధికి రూ.2,850 కోట్లు ఇవ్వండి
పట్టణ సముదాయాల్లో మురుగు నీటి శుద్ధికి సహకరించాలని హర్దీప్‌ సింగ్‌ పురీకి కేటీఆర్‌ వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్‌ నగర సమీపంలోని ప్రాంతాలు మొదలుకుని ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌ ) వరకూ వంద శాతం మురుగు నీటి శుద్ధి కోసం ‘హైదరాబాద్‌ పట్టణ సముదాయం’ (హైదరాబాద్‌ అర్బన్‌ అగ్లోమరేషన్‌) ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు.

సమగ్ర మురుగునీటి పారుదల మాస్టర్‌ ప్లాన్‌ (సీఎస్‌ఎంపీ) సిద్ధం చేశామని, ఇందుకోసం అమృత్‌–2లో భాగంగా రూ.2,850 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో 100% మురుగునీటి శుద్ధితో పాటు మూసీ నది, హైదరాబాద్‌లోని ఇతర నీటి వనరుల్లో మురుగునీటి కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ ప్రాజెక్టు సహాయపడుతుందని తెలిపారు. 

చిన్న వాహనంలో చకచకా
పీఆర్‌టీఎస్‌లో రోప్‌వేలలో వినియోగించే కారు తరహాలో ఓ చిన్న వాహనాన్ని వినియోగిస్తారు. ఇందులో ముగ్గురు నుంచి ఆరుగురు వ్యక్తులు ప్రయాణించవచ్చు. అంటే తక్కువ సంఖ్యలో ప్రయాణికులు వేగంగా వెళ్లేందుకు ఇది దోహదపడుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ‘పాడ్‌ కార్స్‌’, ‘రైల్డ్‌ టాక్సీస్‌’గా ఇవి వినియోగంలో ఉన్నాయి.

మన దేశంలో ఢిల్లీ ఇంటిగ్రేటెడ్‌ మల్టీ మోడల్‌ ట్రాన్సిట్‌ సిస్టం పేరిట 10 నుంచి 15 కిలో మీటర్ల మేర వసంత్‌కుంజ్‌ ఏరియాలో పీఆర్‌టీఎస్‌ను తీసుకొచ్చేందుకు సాధ్యాసా ధ్యాల అధ్యయనం జరుగుతోంది. గతంలో బెంగళూరు, అమృత్‌సర్‌ (పాడ్‌ కార్స్‌)లో పీఆర్‌టీఎస్‌ విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు వచ్చినా ఆచరణకు నోచుకో లేదు. కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే ఢిల్లీ తరువాత ప్రాజెక్టు ప్రారంభ య్యేందుకు అవకాశం ఉన్న రెండో నగరం హైదరాబాద్‌ కానుంది. 
చదవండి: మేమేం తక్కువ?.. అధికార టీఆర్‌ఎస్‌లో తారాస్థాయికి విభేదాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement