కొమురవెల్లి (సిద్దిపేట): ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే కుల వృత్తులకు పూర్వ వైభవం వచ్చిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలో వివిధ గ్రామాలలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలసి ఆవిష్కరించారు. అనంతరం కొమురవెల్లిలో గౌడ కులస్తులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్దార్ సర్వాయి పాపన్న 350 సంవత్సరాలకు ముందే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశాడని, అదే విధంగా నేడు సీఎం కేసీఆర్ పాలనలో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరిగిందన్నారు.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక గౌడ కులస్తులకు వృత్తి పన్ను రద్దు చేశారని, ప్రభుత్వం తీసుకొస్తున్న నీరా పాలసీతో ప్రతి గౌడ కుటుంబం లబ్ధి పొందుతుందని చెప్పారు. బడుగు బలహీన వర్గాల విజ్ఞప్తి మేరకు జనగామ జిల్లా పేరును సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా మార్చేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్, రాగుల సిద్దిరాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment