
నల్లగొండ క్రైం : ఆ కుటుంబాన్ని కరోనా ఇంటికే పరిమితం చేసింది. మహమ్మారి బారిన పడి ఆ కుటుంబంలో ఓ వృద్ధురాలు మృతిచెందింది. దీంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కుటుంబానికి నల్లగొండ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అండగా నిలిచారు. మృతిచెందిన వృద్ధురాలికి అంత్యక్రియలు దగ్గరుండి ఆయనే చేయించి మానవత్వం చాటుకున్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి.. నల్లగొండలోని పాతబస్తీ వంటిస్తంభం ప్రాంతానికి చెందిన పూజారి కుటుంబానికి చెందిన కాంచనపల్లి భారతమ్మ (70) కరోనాతో మృతి చెందింది. మనుమరాలు సుమలత, ఆమె భర్త బొల్లోజు దుర్గాప్రసాద్, కుమారుడు మహేశ్కు ఈనెల 3వ తేదీన కరోనా పాజిటివ్ రావడంతో ఇంటికే పరిమితమయ్యారు. గురువారం వృద్ధురాలు భారతమ్మను స్థానిక కౌన్సిలర్ ఎడ్ల శ్రీనివాస్ అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా తానుండలేనంటూ భయానికే ఇంటికి తిరిగి వచ్చి శుక్రవారం ఉదయం మరణించింది.
కరోనాతో భయంతో ఉన్న కుటుంబానికి అంత్యక్రియలు చేయడం మరింత క్లిష్టంగా మారింది. దీంతో కౌన్సిలర్ శ్రీను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వృద్ధురాలికి హిందూపూర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేయించారు. వృద్ధురాలి కుటుంబ సభ్యులు కరోనాతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాలేమని చెప్పడంతో ఎమ్మెల్యే అంతా తానై అంత్యక్రియలు పూర్తి చేశారు. అవసరమైన మందులు , నిత్యావసర సరుకులను అందిస్తామని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment