తెలంగాణలో గ్రాడ్యుయేట్‌ పోరుకు సై.. | Telangana: Parties Are Preparing For Graduate MLC Election | Sakshi
Sakshi News home page

గ్రాడ్యుయేట్‌ పోరుకు సై.. నల్లగొండ నుంచి కోదండరాం

Published Wed, Feb 3 2021 2:18 AM | Last Updated on Wed, Feb 3 2021 11:06 AM

Telangana: Parties Are Preparing For Graduate MLC Election - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం మూడు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. నల్లగొండ–ఖమ్మం–వరంగల్, రంగారెడ్డి–హైదరాబాద్‌– మహబూబ్‌నగర్‌ జిల్లాల గ్రాడ్యు యేట్‌ స్థానాలకు ఈనెల రెండో వారం నుంచి మార్చి మొదటి వారంలోపు ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్‌ వెలు వడే అవకాశం ఉండడంతో అభ్యర్థుల ఖరారు, ఎన్నికల వ్యూహాల రూపకల్పనపై పార్టీలు దృష్టి సారించాయి. కొం దరు తెలంగాణ ఉద్యమకారులు, స్వతంత్రులు సైతం బరిలో నిలుస్తుండడంతో ఎన్నికలపై ఆసక్తిని కలిగిస్తోంది.  

కారు జోరు 
టీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో బాధ్యతలను ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ తన భుజాన వేసుకున్నారు. సిట్టింగ్‌ స్థానమైన నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డినే బరిలో దింపాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆయా జిల్లాల నేతలతో సమన్వయ భేటీలు నిర్వహించిన కేటీఆర్‌ ఆదేశాల మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయి సమావేశాలతో కారుదండు బిజీగా ఉంది. అయితే, తమకు ఎప్పుడూ కలసిరాని రంగారెడ్డి–హైదరాబాద్‌–మహబూబ్‌నగర్‌ఎమ్మెల్సీ స్థానం విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు రంగారెడ్డి జిల్లాకు చెందిన నాగేందర్‌గౌడ్, శుభప్రద పటేల్, పీఎల్‌ శ్రీనివాస్, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ల పేర్లు టీఆర్‌ఎస్‌ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరో ఎన్‌ఆర్‌ఐ పేరు కూడా తాజాగా తెరపైకి వచ్చినట్టు సమాచారం. మరోవైపు ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌కు మద్దతు ఇచ్చే అంశంపై కూడా పార్టీలో చర్చ జరుగుతోందని తెలిసింది.  

కాంగ్రెస్‌ కసరత్తు 
ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్న కాంగ్రెస్‌.. సామాజిక సమీకరణలతో పాటు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని నల్లగొండ నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, రంగారెడ్డి నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డిల పేర్లను దాదాపు ఖరారు చేసింది. అయితే, నల్లగొండ నుంచి ఎస్టీ కోటాలో రాములు నాయక్‌ కన్నా ఆదివాసీ కాం గ్రెస్‌ జాతీయ నాయకుడు బెల్లయ్య నాయక్‌ మేలనే అభిప్రాయంతో హైకమాండ్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ దాసోజు శ్రావణ్, మానవతారాయ్‌ల అభ్యర్థిత్వాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇక, రంగారెడ్డి విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి వియ్యంకుడు, దిల్‌సుఖ్‌నగర్‌ విద్యాసంస్థల అధినేత ఎ.వి.ఎన్‌.రెడ్డి అభ్యర్థిత్వాన్ని టీపీసీసీ తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఉండడం, విద్యావేత్త కావడం, రాజకీయ నేపథ్యం ఉండడంతో ఆయన పేరును కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారని చెపుతున్నారు.  

కదనరంగంలో... కమలం 
ఇక ఇటీవలి విజయాలతో మంచి ఊపుమీదున్న బీజేపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే రెండు స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. రంగారెడ్డి నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు, నల్లగొండ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిలు కార్యక్షేత్రంలోకి దిగారు. రాంచందర్‌రావుకు ఉన్న మంచి ఇమేజ్‌తో పాటు వరంగల్, ఖమ్మం, నల్లగొండ లాంటి ప్రాంతాల్లో బీజేపీకి ఉన్న పట్టు మంచి ఫలితాలు సాధించి పెడతాయని, కనీసం సిట్టింగ్‌ స్థానాన్ని అయినా నిలబెట్టుకుంటామని కమలనాథులు ధీమాగా ఉన్నారు. మరోవైపు నల్లగొండ స్థానానికి వామపక్షాల అభ్యర్థిగా జయసారథి రెడ్డి కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. రంగారెడ్డిలో వామపక్షాలు డాక్టర్‌. కె.నాగేశ్వర్‌కు మద్దతు తెలిపేందుకు సిద్ధమవుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement