
టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం, పినపాక, లక్ష్మీదేవిపల్లి మండలాల అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తోంది. శుక్రవారం పినపాక మండలం అమరారం అటవీ ప్రాంత సమీపాన ఆవుల మందపై దాడి చేసి లేగదూడను చంపిన పెద్ద పులి శనివారం తెల్లవారుజామున టేకులపల్లి మండలంలోకి వచ్చింది. మండలం పరిధిలోని సిద్ధారం నుంచి మొట్లగూడెం మధ్యలో ఉన్న జంగాలపల్లి జంగిల్ క్యాంపు అభయారణ్యంలోకి శుక్రవారం అర్ధరాత్రి దాటాక పులి వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు.
ఇప్పటికే ఆ ప్రాంతాల్లో క్యాంపు ఏర్పాటుచేసిన అటవీ అధికారులకు పెద్దపులి కనిపించడంతో సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. ఇక శనివారం ఉదయం అధికారులు అటవీ ప్రాంతంలో పులి అడుగుజాడల కోసం ఆరా తీయగా.. జంగాలపల్లి–మొట్లగూడెం మధ్య ఉన్న గుట్టలో సేద తీరిందని, సాయంత్రం 5 గంటల సమయంలో నిద్ర లేచి వెళ్లిపోయిందని తెలిపారు. ఈమేరకు పులి ఆచూకీ కోసం గాలిస్తూ, అటవీ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.