
సాక్షి, హైదరాబాద్: ‘ఎందరో ప్రాణత్యాగం చేసి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు నయా నిజాం చేతిలో బందీ అయింది. వారి నుంచి విముక్తి కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరడం చారిత్రక అవసరం. దీనికోసం మీ గ్రామాల్లో, మండలాల్లో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు కృషి చేయండి.
కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే మహాయజ్ఞంలో భాగస్వాములు కండి’అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ప్రవాస తెలంగాణవాసులకు విజ్ఞప్తి చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్‌రెడ్డి, టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలసి శుక్రవారం డల్లాస్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.
తెలంగాణ కలను సాకారం చేశారు..
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఇచ్చారు. రాజకీయంగా ఒడిదుడుకులు ఎదురవుతాయని తెలిసినా తెలంగాణ ప్రజల కలను సాకారం చేశారు. ఎనిమిదేళ్ల తర్వాత వెనక్కు తిరిగి చూసుకుంటే ఎందుకు వచ్చిందా తెలంగాణ అనే పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితిని చూసుకుంటూ కూర్చోవద్దు.
అధికార పక్షం 120 కేసులు పెట్టి జైల్లో పెట్టినా తెలంగాణ ప్ర జల మీద ఉన్న బాధ్యతతో నిలబడి పని చేస్తున్నా. జైల్లో చిప్పకూడు తిన్న తర్వాతే నా లో గుండె ధైర్యం పెరిగింది. ఆ చిప్ప కూడు మీద ఒట్టేసి చెపుతున్నా. కేసీఆర్‌ను పాతాళానికి తొక్కే బాధ్యత తీసుకుంటా. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పొలిమేరల దాకా తరిమే వరకు పోరాటం చేస్తా. నా ప్రాణాలు పోయినా ఫర్వాలేదు’ అని చెప్పారు.
తెలంగాణను సర్వనాశనం చేశారు..
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణను ఇచ్చిన పార్టీగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉంది. రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ఇప్పుడు రూ.5 లక్షల కోట్ల అప్పు ఉంది. కేసీఆర్ హిట్లర్‌కా బాప్ అయ్యారు. సోనియా రుణం తీర్చుకునే సమయం వచ్చిందని ఎన్నారైలు గుర్తించాలి. ఎన్నారైలకు 2–3 ఎంపీ సీట్లు, 5–6 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేలా అధిష్టానాన్ని ఒప్పిస్తాం’ అని వివరించారు.
‘ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్సను తెలంగాణ సర్కార్ చేయించలేకపోయింది. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.1000 దాటితే కరోనాతో పాటు 1,500 రకాల జబ్బులకు ఉచిత వైద్యం ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తోంది. కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను తయారు చేస్తోంది’ అని ప్రశంసించారు.
సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి. చిత్రంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment