
సాక్షి, మల్కాజిగిరి( హైదరాబాద్): మల్కాజిగిరిలో కొంతకాలంగా టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య నడుస్తున్న రాజకీయ పరిస్థితులు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండా సాక్షిగా ఘర్షణకు దారితీసి మల్కాజిగిరిలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. వివరాలు.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సర్కిల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణకు వచ్చిన సందర్భంగా మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ మధ్య జరిగిన వాదనతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
జెండా ఆవిష్కరణకు ముందే ఇరువర్గాల నాయకులు గొడవకు దిగడంతో తోపులాట జరిగి గందరగోళ పరిస్థితి తలెత్తింది. ఈ సందర్భంగా గాయాలైన కార్పొరేటర్ శ్రవణ్ తన అనుచరులు, పార్టీ నాయకులతో కలిసి మల్కాజిగిరి చౌరస్తా వద్దకు చేరుకొని ధర్నా చేపట్టడంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, నాయకులు, కార్యకర్తలు కూడా బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పోలీసులు రెండు వర్గాలను అక్కడి నుంచి పంపించివేశారు. ఈ ఘటనపై పరస్పరం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment