సాక్షి, మెదక్: ఫుడ్ ఫాయిజన్‌తో రెండు వారాల వ్యవధిలో కన్న పిల్లలు కళ్ల ముందే చనిపోవడంతో జీర్ణించుకోలేని ఆ తల్లి.. అటు భర్త.. ఇటు పిల్లలు లేని జీవితం తనకు వద్దనుకుంది. మనోవ్యధతో ఆ తల్లి ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందిన విషాద ఘటన మనోహరాబాద్ మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మనోహరాబాద్ మండల కేంద్రానికి చెందిన పోతరాజు అనిత(31) కూలిపని చేసుకుంటూ తన కూతురు లక్ష్మిప్రియ (11), కుమారుడు కిషోర్ (8)లతో కలిసి జీవిస్తోంది. ఇదిలా ఉండగా 18 నెలల క్రితం తన భర్త రాము అనారోగ్యంతో మృతి చెందాడు.
కాగా గత నెల డిసెంబర్ 22న రాత్రి ఇంట్లో చికెన్ వండి ఇద్దరు పిల్లలు సహా తల్లి తిని పడుకున్నారు. మరుసటి రోజు పిల్లలిద్దరికి రక్తపు వాంతులు, విరేచనాలయ్యాయి. దీంతో వారిని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు. నీలోఫర్‌లో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి కుమారుడు డిసెంబర్ 27న మృతి చెందాడు. కూతరు జనవరి 10న మృతి చెందింది. అప్పటి నుంచి అనిత ఒంటరైంది. దీంతో మనోవేదనకు గురై గురువారం మధాహ్నం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment