ప్రమాదంలో నుజ్జునుజ్జయిన జీపు
చింతపల్లి: ఆగి ఉన్న లారీని జీపు అతివేగంగా ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వెంకటేశ్వరనగర్‌లో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన 12 మంది సమీప బంధువులు హైదరాబాద్‌లోని నాదర్‌గుల్‌లో గురువారం రాత్రి గృహప్రవేశం కార్యక్రమానికి వెళ్లారు. అది ముగిసిన తర్వాత తెల్లవారుజామున జీపులో స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు.
చింతపల్లి మండల పరిధిలోని మాల్ వెంకటేశ్వరనగర్‌కు రాగానే వారి వాహనం రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జీపులో ఉన్న పందుల రాములు (60), పందుల సత్తయ్య (58) అక్కడికక్కడే మృతిచెందారు. పందుల పాండు (50), పందుల కృష్ణ, పందుల మైసయ్య, జంపాల రామస్వామి, బోయపల్లి యాదమ్మ, బోయపల్లి విజయ, పందుల వెంకటయ్య, వాహన డ్రైవర్ పందుల యాదగిరికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పాండు చికిత్స పొందుతూ మృతిచెందారు. యాదయ్య, జంపాల రామస్వామి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. అతివేగం, డ్రైవర్ తప్పిదమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment