CM KCR Sensational Comments On Central Govt Over Irrigation Projects - Sakshi
Sakshi News home page

'అప్పు'డేమైంది..?.. కేంద్రంపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం

Published Fri, Jul 29 2022 2:10 AM | Last Updated on Fri, Jul 29 2022 10:53 AM

Tripartite Agreement Irrigation Projects KCR Central Govt - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటేనే నిలిపివేసిన రుణాల విడుదలకు అనుమతి స్తామని కేంద్ర ప్రభుత్వం మరోమారు తేల్చి చెప్పింది. రుణమిచ్చే సంస్థ, రుణం తీసుకునే సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందంలో భాగస్వామ్యం కావాలని కేంద్రం పట్టు పడుతోంది. కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులకు వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాలకు ఇదే నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. అలా జరిగితే కార్పొరేషన్లు తీసుకునే రుణాలు రాష్ట్ర రుణ ఖాతాలోకి వెళ్తాయి. తద్వారా రాష్ట్రం ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు తీసుకునే రుణాలు తగ్గుతాయని అధికారవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. 

అప్పుడు లేని షరతులు ఇప్పుడెందుకు?
రుణ ఒప్పందాల సమయంలో లేని షరతులు అకస్మాత్తుగా ముందుకు తీసుకుని రావడంపై రాష్ట్ర సర్కారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రుణాల్లో ఇప్పటికే 70 శాతం వరకు విడుదల చేశాక ఇప్పుడు ఈ త్రైపాక్షిక ఒప్పందం అంటూ మెలిక పెట్టడంపై సీఎం కేసీఆర్‌ కూడా అగ్రహంగా ఉన్నట్లు సమాచారం. తీసుకున్న రుణాలపై నెలవారీ చెల్లింపుల్లోనూ ఎక్కడా డిఫాల్ట్‌ కాలేదని, అయినా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికే ఈ విధంగా కేంద్రం వ్యవహరిస్తుందన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ అంశంపై పలుమార్లు రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం.. చివరి ఆప్షన్‌గా కోర్టుకు వెళ్లడం ఒక్కటే మార్గమన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 

కేంద్రం ఉత్తర్వులతో నిలిచిన నిధులు
రాష్ట్రంలో ప్రధానంగా కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ), రూరల్‌ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) సహా నాబార్డ్‌ వంటి సంస్థలు రూ.76,900 కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఈ మొత్తంలో ఇప్పటికే రూ.43 వేల కోట్లు విడుదల చేయగా, వాటి ఖర్చు సైతం జరిగిపోయింది. మరో రూ.33 వేల కోట్లు ఇవ్వాల్సి ఉన్నా త్రైపాక్షిక ఒప్పందాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల కారణంగా రావాల్సిన నిధులు ఆగిపోయాయి. 

ఫలించని అధికారుల చర్చలు
త్రైపాక్షిక ఒప్పందం అంటే రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉండాల్సి వస్తుంది. అదే జరిగితే కార్పొరేషన్‌ రుణాలు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి చేరుతాయి. తద్వారా రాష్ట్రానికి వచ్చే ఇతర రుణాలు తగ్గిపోయే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రంతో చర్చలకు రాష్ట్ర ఉన్నతాధికారులు నడుం బిగించారు. నాలుగు రోజుల కిందట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు ఢిల్లీకి వచ్చిన సీఎస్‌ సోమేశ్‌కుమార్, ఆర్థిక, సాగునీటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్‌కుమార్‌లు కేంద్ర ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. అయినా ఫలితం లేకపోవడంతో సీఎం కేసీఆర్‌ తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రుణాల అంశంపై ఆర్ధిక రంగ నిపుణులు, మాజీ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఢిల్లీలోని తన నివాసంలో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. గురువారం కూడా ఇద్దరు, ముగ్గురు ఆర్థిక, న్యాయ నిపుణులతో ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. 

ప్రాజెక్టులకు అనుమతులకూ కొర్రీలు!
కృష్ణా, గోదావరి బేసిన్‌ల పరిధిలో చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతి విషయంలో కూడా కేంద్రం అనేక కొర్రీలు పెడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సూచనల మేరకు గడిచిన మూడురోజులుగా ఇరిగేషన శాఖ అధికారులు ఈ విషయమై కేంద్ర జల సంఘం, జల శక్తి శాఖల చుట్టూ తిరుగుతున్నా పెద్ద ఫలితం లేదని చెబుతున్నారు. ఒక అంశంపై స్పష్టత ఇస్తే, మరో అంశాన్ని కేంద్రం ముందుకు తీసుకొస్తోందని, సీతారామ, కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, రామప్ప–పాకాల, తుపాకులగూడెం ప్రాజెక్టుల విషయంలో కాలుకు వేస్తే వేలికి..వేలికేస్తే కాలుకు అన్న చందంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో కూడా కేంద్రం తీరుపై ఆగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రి తదుపరి కార్యాచరణపై గురువారం ఇద్దరు, ముగ్గురు ఎంపీలతో మాట్లాడినట్లు తెలిసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement