సాక్షి, కరీంనగర్: ఉప ఎన్నికను ఎదుర్కొనే వనరులు పుష్కలంగా ఉండి కూడా.. అభ్యర్థి కోసం అన్వేషించే విచిత్ర పరిస్థితిని అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఎదుర్కొంటోంది. 17 ఏళ్లుగా టీఆర్‌ఎస్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో త్వరలో ఉప ఎన్నిక రాబోతోంది. ఈ ఎన్నికను ప్రస్తుతం అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన ఈటల కమలం గుర్తు మీద పోటీ చేయనుండగా, గత ఎన్నికల్లో ఈటలపై ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. టీఆర్‌ఎస్ టికెట్టు ఆశించినట్లు ప్రచారం జరిగినా.. ఇటీవల పీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలవడంతో కాంగ్రెస్ నుంచే పోటీ చేయనున్నట్లు సంకేతాలు వెళ్లాయి. అంటే ప్రధాన పార్టీల్లో రెండింటి నుంచి అభ్యర్థులు ఎవరో తేలింది. ఎటొచ్చీ.. అధికార టీఆర్‌ఎస్ నుంచి అభ్యర్థి ఎవరనే విషయంలో స్పష్టత రావడం లేదు.
వివిధ కోణాల్లో పరిశీలన
ఈటల రాజేందర్ 15 ఏళ్లుగా టీఆర్‌ఎస్ నుంచి గెలుస్తూ రావడం, టీఆర్‌ఎస్‌లో కీలక వ్యక్తిగా వ్యవహరించడంతో ఆయన తరువాత ఆ స్థాయిలో లీడర్‌షిప్ పెరగలేదు. ఒక మండలానికి జెడ్పీటీసీ స్థాయిలో పోటీ ఇవ్వగల నాయకులే టీఆర్‌ఎస్‌లో మిగిలారు తప్ప నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించేలా లేరు. ఈ పరిస్థితుల్లో బలమైన ఈటలను ఎదుర్కొనేందుకు గల అన్ని వనరులను టీఆర్‌ఎస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకుల్లో ఈటలను ఎదుర్కొనే స్థాయిలో బలమైన నాయకుడు కనిపించలేదని సమాచారం.
ఒకరిద్దరు ఉన్నా, ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికలో పోటీ ఇవ్వలేరని నిఘావర్గాలు ఇప్పటికే అధిష్టానానికి సమాచారం చేరవేశాయి. ప్రత్యామ్నాయంగా వేరే పార్టీల నుంచి అభ్యర్థిని తీసుకొచ్చి పోటీలో నిలిపితే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రయోగం చేసినట్టుగా రాజకీయ వర్గాలే ఆశ్చర్య పడేలా అభ్యర్థిని నిలపాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ, సామాజిక సమీకరణాలను కూడా ఈ విషయంలో నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎంపిక?
రాబోయే ఉప ఎన్నికలో బీజేపీ తరఫున ఈటల రాజేందర్ బరిలో నిలుస్తున్నారు. ఆయన బీసీల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు. రాజేందర్ సతీమణి జమున ‘రెడ్డి’ వర్గానికి చెందిన వారు. బీజేపీకి సహజంగానే అగ్రవర్ణాల పార్టీగా పేరుంది. ఈ నేపథ్యంలో సామాజిక కోణంలో ఈటలకు బీసీ, రెడ్డితోపాటు బీజేపీని ఇష్టపడే వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. కాంగ్రెస్ పార్టీ నుంచి కౌశిక్ రెడ్డి మినహా మరో అభ్యర్థి పేరు పరిశీలనలో లేదు. హుజూరాబాద్‌లో ఉన్న బలమైన “రెడ్డి’ వర్గంపై ఆయనకు కూడా నమ్మకం ఉంది.
ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ సామాజిక కోణంలో ఎస్‌సీ వర్గానికి ప్రాతినిథ్యం కల్పించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈటల రాజీనామా తరువాత చోటు చేసుకున్న పరిణామాల్లో ప్రభుత్వం దళిత సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. దళితులకు ప్రత్యేక నిధుల కేటాయింపు మొదలుకొని ఇటీవల దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ విషయంలో సీఎం స్పందన, ఇతర పరిణామాలు హుజూరాబాద్‌లో కొత్త రాజకీయ సమీకరణాలపై ఆసక్తిని రేపుతోంది.
జనరల్ సీటులో దళిత వర్గానికి చెందిన వారిని నిలబెట్టి గెలిపించాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తద్వారా బీజేపీ, కాంగ్రెస్‌లకు కౌంటర్ ఇచ్చినట్లవడమే గాక దళిత వర్గాల సంపూర్ణ మద్దతు లభిస్తుందనేది కేసీఆర్ ఆలోచనగా చెపుతున్నారు. ఎస్సీ నుంచి అభ్యర్థిని నిలపాల్సి వస్తే ఎవరికి టికెట్టు ఇవ్వాలో కేసీఆర్‌కు ఓ క్లారిటీ ఉండి ఉంటుందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.
ముద్దసాని మాలతికి అవకాశం..?
తెలుగుదేశం సీనియర్ నేత, దివంగత మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి సతీమణి ముద్దసాని మాలతి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు. బ్యాంక్ మేనేజర్‌గా పదవీ విరమణ పొందిన ఆమె క్రిస్టియన్ మైనారిటీగా పేరున్నారు. దామోదర్ రెడ్డి మరణం తరువాత ఆమె రాజకీయాలకు దూరంగానే ఉన్నా.. హుజూరాబాద్ నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి ద్వారా ఆమెకు కూడా సంబంధాలున్నాయి. 2014 శాసనసభ ఎన్నికల్లో మానకొండూరు నియోజకవర్గం నుంచి ముద్దసాని మాలతి బరిలో నిలపాలని టీడీపీ భావించినప్పటికీ, తనయుడు కశ్యప్ రెడ్డి బరిలో నిలిచారు. మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ముద్దసాని మాలతికి సీటివ్వడం వల్ల ఎస్సీ, రెడ్డి వర్గాల మద్దతుతో పాటు మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డిపై ఉన్న సానుభూతి కూడా కలిసొస్తుందని కేసీఆర్ ఆలోచనగా చెపుతున్నారు. మాలతి పోటీ చేయడానికి అంగీకరించని పక్షంలో కశ్వప్ రెడ్డి బరిలో నిలవాలని యోచిస్తున్నట్లు సమాచారం.
బీసీ, అగ్రవర్ణాల్లో నుంచి అన్వేషణ..
► ఒకవేళ బీసీని అభ్యర్థిగా నిలబెట్టాలని భావిస్తే తానే బలమైన క్యాండిడేట్‌నని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్ రావు భావిస్తున్నారు. ఈటల రాజీనామా తరువాతే ఆయన హుజూరాబాద్‌లో కనిపిస్తున్నారనే అపవాదు ఉంది. గతంలో 2009, 2010లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఈటలపైనే ఓడిపోవడం గమనార్హం.
► రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మికాంతారావు కుటుంబం నుంచి ఎవరినైనా అభ్యర్థిగా నిలబెట్టాలనుకున్నా.. బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి కెప్టెన్ తనయుడు సతీష్ హుస్నాబాద్‌లో ఎమ్మెల్యేగా ఉన్నారు.
► మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు వాణిదేవి ఇటీవలే హైదరాబాద్ ఎమ్మెల్సీగా గెలిచారు.
► రెడ్డి వర్గం నుంచి మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి సోదరుడు రిటైర్డ్ ఐఏఎస్ ఎం.పురుషోత్తం రెడ్డి పేరు సైతం పరిశీలనలో ఉంది. ఇటీవలే దామోదర్ రెడ్డి తనయుడు కశ్యప్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరినప్పటికీ, పురుషోత్తం రెడ్డి అభ్యర్థిత్వంపై స్పష్టత లేదు.
► పురుషోత్తం రెడ్డి కన్నా ముద్దసాని మాలతి బలమైన అభ్యర్థిగా భావిస్తే హుజూరాబాద్‌లో రాజకీయం మారే అవకాశం ఉంది.
► ఈటల బీజేపీలో చేరడంతో అసంతృప్తికి గురైన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కూడా గులాబీ కండువా కప్పుకొని పోటీ చేయాలని భావిస్తున్నా, అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదు.
► మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ పేరు తొలుత వినిపించినా, ఆయన వేములవాడపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
చదవండి: వాటర్ లీకేజీ ప్రాబ్లమ్స్ .. వాటర్ ప్రూఫ్ సొల్యూషన్స్
Comments
Please login to add a commentAdd a comment