సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉపపోరులో ఆసక్తికర పరిణామం నెలకొంది. దేశంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేసే ప్రక్రియలో ఈసీ తీసుకున్న కీలక నిర్ణయమే ఇందుకు కారణం. కరోనా ముప్పు పొంచిఉన్న నేపథ్యంలో ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తాజా మార్గదర్శకాలు విడుదల చేసి వాటిపై ఈనెల 30లోగా అభిప్రాయాలు పంపాలని ఈసీ అన్ని పార్టీలను కోరింది. ఆయా పార్టీల నుంచి వచ్చిన అభిప్రాయాలను సమీక్షించాక, ఈసీ తన నిర్ణయాన్ని వెలువరించడానికి మరో మూడు, నాలుగు వారాలు పట్టే అవకాశాలున్నాయి.
ఈ లెక్కన సెప్టెంబరు ఆఖరువారంలో లేదా అక్టోబరు వరకు నోటిఫికేషన్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. దీంతో రేపోమాపో హుజూరాబాద్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ వస్తుందనుకున్న పార్టీలంతా కాస్త నిరాశకు గురయ్యాయి. నిబంధనల ప్రకారం.. డిసెంబరులోపు హుజూరాబాద్ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే ప్రచారంలో ఐపీఎల్ లెవల్‌లో వేడి పెంచిన రాజకీయ పార్టీలు అనూహ్యంగా వచ్చిన ఆరేడు వారాల సమయాన్ని ఎవరికి వారు తమకు దక్కిన ‘సూపర్ ఓవర్’గానే భావిస్తున్నాయి.
కొత్త నేతలు తెరపైకి..!
హుజూరాబాద్ ఉప ఎన్నికను అధికార టీఆర్‌ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమను గెలిపిస్తారన్న ధీమా గులాబీ నేతల్లో ఇప్పటికే కనిపిస్తోంది. రైతుబంధు, రైతుబీమా, వృద్ధాప్య పింఛన్లు, కల్యాణలక్ష్మికి తోడుగా దళితబంధుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తాజాగా.. దళితుల అభ్యున్నతికి దళితబంధు పేరుతో రూ.ఐదు వందల కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నిధులను 16వ తేదీన శాలపల్లి వేదికగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు సీఎం చేతుల మీదుగా అందజేయనున్నారు. ఈ పథకంతో నియోజకవర్గంలో దాదాపు 40 వేలకుపైగా దళితులను ఆకట్టుకునేందుకు అధికార పార్టీ సిద్ధమైంది. వీటికితోడు నియోజకవర్గంలో పెండింగ్ పనులు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మాణాలను చేపడతామని, ప్రతీ గ్రామానికి మహిళా భవన్‌లు నిర్మిస్తామని హామీ ఇస్తోంది.
ముగ్గురు కొత్త నేతలను ముందుపెట్టి..
ఈ ఉపపోరులో గెలిచే పావులు వేగంగా కదుపుతున్న టీఆర్‌ఎస్ పార్టీ పథకాలతోపాటు స్థానిక నేతలకు పదవుల పరంగా ఇచ్చిన అవకాశాలను కూడా ప్రచారం చేసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బండా శ్రీనివాస్, ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్న పాడి కౌశిక్‌రెడ్డి, అనూహ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా తెరపైకి వచ్చిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఈ విరామ సమయంలో ముమ్మరంగా ప్రచారంలో పాల్గొనేలా గులాబీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి ఇన్ని విస్తృత అవకాశాలు కల్పించామని, గెలిస్తే మరింత చేస్తామన్న సంకేతాలు పంపేలా చర్యలు చేపడుతున్నారు.
ఆత్మగౌరవంతో ఈటల.. అన్నీ తానై!
రాజీనామా చేసిన సమయం నుంచి బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. తాజాగా.. లభించిన విరామ సమయం తనకు కలిసి వస్తుందని ఆయన వర్గం ఆశాభావం వ్యక్తంచేస్తోంది. ఆత్మగౌరవ నినాదం, నియోజకవర్గంలో గతంలో చేసిన అభివృద్ధి, రెండు దశాబ్దాలుగా తనకు స్థానికులతో ఉన్న అనుబంధం గెలిపిస్తాయని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఈసీ నోటిఫికేషన్ వెలువరించే వరకు తన ప్రచారానికి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల ఈటల చేపట్టిన ప్రజాదీవెన పాదయాత్రకు బండి సంజయ్ వచ్చారు.
అలాగే.. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇన్‌చార్జి కావడంతో ఇక్కడే ఉంటున్నారు. ఇక దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ ఎంపీ వివేక్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ కూడా ఈటలకు మద్దతుగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. ఇంకా స్పీడ్ పెంచాలని ఆ శిబిరం భావిస్తోంది. గులాబీ పార్టీ నుంచి ముగ్గురు మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, బాల్కసుమన్ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నోటిఫికేషన్ అనంతరం బీజేపీ రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు సైతం హుజూరాబాద్‌లో విస్తృతంగా పర్యటిస్తారని కమలనాథులు చెబుతున్నారు.
రెండుపార్టీల గుట్టు బయటపెడతాం..
ఇంతవరకూ అభ్యర్థిని ఖరారు చేయని కాంగ్రెస్‌కు ఈ విరామ సమయం బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. బీజేపీ–టీఆర్‌ఎస్‌ల ప్రజా వ్యతిరేక విధానాలను, ఆ పార్టీల అసలు గుట్టును ప్రజలకు వివరించేందుకు ఇదే చక్కటి అవకాశమని భావిస్తోంది. ఇప్పటికే అభ్యర్థి కూర్పుపై కసరత్తు ప్రారంభించిన హస్తం పార్టీ పలువురు సీనియర్ నాయకులతో సంప్రదింపులు ముమ్మరం చేసింది. హుజూరాబాద్‌లో పోటీ చేసేందుకు ఇతర నియోజకవర్గాల నేతలు ఆసక్తి చూపిస్తున్నా.. స్థానికులైతేనే మేలన్న ఆలోచనలో టీపీసీసీ ఉందని సమాచారం. గెలిచినా, ఓడినా.. కేవలం రెండేళ్ల సమయం మాత్రమే ఉంటుంది.
ఆ వెంటనే శాసన సభ ఎన్నికలు వస్తాయి. రెండుసార్లు పోటీ అంటే సీనియర్లు ఖర్చు భరించే స్థితిలో లేరు. దీంతో పొరుగునే ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా లేదా హుజూరాబాద్‌కే చెందిన ఓ కాంగ్రెస్ నేతతోపాటు, మరో ఎన్నారైతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఈసీ తీసుకున్న నిర్ణయం ఒక విధంగా కాంగ్రెస్ నెత్తిన పాలు పోసిందనే చెప్పాలి. అభ్యర్థిని ఖరారు చేసుకోవడంతోపాటు, బీజేపీ–టీఆర్‌ఎస్‌లు ప్రజల్ని మభ్యపెడుతున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టేందుకు చిక్కిన అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. ముఖ్యంగా దళిత సంక్షేమం విషయంలో ఇరు పార్టీల కపట ప్రేమను బయటపెడతామని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment