సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు బాధ్యతలు మరిన్ని పెరగనున్నాయి. ఈ దిశగా త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలను విద్యాశాఖ రూపొందించింది. మార్పుచేర్పుల తర్వాత ప్రభుత్వ ఆమోదం తీసుకుని ఆదేశాలివ్వనున్నట్లు విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రత్యక్ష తరగతుల ప్రారంభం, మధ్యాహ్న భోజనం తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఎదురయ్యే సమస్యలను ఉన్నతాధికారులు అధ్యయనం చేశారు.
వీటిని పరిష్కరించగల సమర్థత ప్రధానోపాధ్యాయుడికే ఉంటుందని భావించారు. ఇందులో కోవిడ్ నిబంధనల అమలే కీలకంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి గతం లోనే ప్రభుత్వ మార్గదర్శకాలు వెలువడ్డాయి. పాఠశాలల్లో శానిటైజేషన్, మధ్యాహ్న భోజన పథకం అమలులో అనుసరించాల్సిన జాగ్రత్తలపై ఇందులో ప్రస్తావించారు. ప్రత్యక్ష బోధన చేస్తున్న పాఠశాలల్లో కొన్నిచోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి.
ఎక్కువ మందికి వ్యాపించడానికి శానిటైజేషన్ లోపమే కారణమని అధికారులు గుర్తించారు. కానీ పూర్తి బాధ్యులెవరనేది తేల్చడం కష్టమైంది. సమష్టిగా జరిగిన చర్యలకు ఒకరిని ఎలా బాధ్యులను చేస్తారనే ప్రశ్న తలెత్తింది. దీనిపై ఉన్నతాధికారులు చర్చించి, కొత్త మార్గదర్శకాలు విడుదల చేయాలని నిర్ణయించారు.
కొత్త మార్గదర్శకాలు..
►పాఠశాల పరిశుభ్రతకు హెచ్‌ఎం బాధ్యత తీసుకోవాలి. స్థానిక పారిశుధ్య సిబ్బంది శానిటైజేషన్ విధులను నిర్వర్తించలేని పరిస్థితి ఉంటే హెచ్‌ఎం ఉన్నతాధికారుల దృష్టికి తేవాలి. కాగా, తమ పరిధిలో లేని పారిశుధ్య కార్మికుడిపై తామెలా ఫిర్యాదు చేస్తామని హెచ్‌ఎం అడుగుతున్నారు. అలా చేస్తే రాజకీయ వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.
►విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని గమనించడం, అవసరమైన పరీక్షలు చేయించడమూ హెచ్‌ఎం బాధ్యతే. లక్షణాలు కన్పిస్తే పరీక్షలు చేయించడం, మిగతా విద్యార్థులనూ పరీక్షించడం వం టివి చేయాలి. అయితే ఈ పనులన్నీ హెచ్‌ఎం చేస్తే ఇతర విధుల మాటేంటని ప్రశ్నిస్తున్నారు.
►మధ్యాహ్న భోజనంలో హెచ్‌ఎం పాత్రను కీల కం చేయబోతున్నారు. పదార్థాలు శుభ్రంగా ఉం డేలా చర్యలు తీసుకోవాలి. పదార్థాలు ఎక్కడి నుంచి తెప్పించేది రికార్డు చేయాలి. వంట తయారీలో పాల్గొనే వారి ఆరోగ్య పరిస్థితిని గమనించాలి. ప్రతికూల పరిస్థితులు వస్తే తాము బలి అవుతామని హెచ్‌ఎంలు అంటున్నారు.
నిధుల్లేకుండా బాధ్యతలేంటి?: జంగయ్య
కోవిడ్ నిబంధనల అమలుకు అవసరమైన శానిటైజేషన్‌కు ప్రభుత్వం ముందుగా నిధులివ్వాలి. చాలామంది హెచ్‌ఎంలు విధిలేని పరిస్థితుల్లో వారి సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం ముందు కార్యాచరణపై దృష్టి పెట్టాలి. శానిటైజేషన్‌కు నిధులిచ్చాక హెచ్‌ఎంలను బాధ్యులను చేస్తే ఇబ్బంది ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment