సాక్షి, హైదరాబాద్: ఖజానాకు మరింత ఆదాయం సమకూర్చుకోవడంపై దృష్టిపెట్టిన రాష్ట్ర సర్కారు.. వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ‘రాజీవ్ స్వగృహ’ ఇళ్లస్థలాలను వేలం వేయాలని నిర్ణయించింది. తొమ్మిది జిల్లాల పరిధిలోని 1,408 ప్లాట్లను వేలం వేయడం ద్వారా రూ.800 కోట్ల వరకు రాబట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లాలవారీగా ప్లాట్ల వేలానికి సంబంధించిన వివరాలను శుక్రవారం ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ మినహా చోట్ల భౌతికపద్ధతిలో వేలం నిర్వహిస్తామని తెలిపింది. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన భూముల ‘ఈ–వేలం’లో ‘హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ), పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఐఐసీ)’ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం జిల్లాల్లో జరిగే వేలం నిర్వహణలో కలెక్టర్లకు సహకరించి, పర్యవేక్షించే బాధ్యతను వాటికే అప్పగించారు. వేలానికి వీలుగా ఉన్న ప్రాజెక్టుల లేఔట్లను ఇప్పటికే సిద్ధం చేసిన అధికారులు.. ఈనెల 18న, వచ్చే నెల ఏడున ప్రిబిడ్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 12 నుంచి వచ్చే నెల 10వ తేదీ మధ్య కొనుగోలుదారులు సంబంధిత స్థలాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు. వచ్చే నెల 14, 15, 16, 17 తేదీల్లో జిల్లాల వారీగా ప్లాట్ల వేలం ప్రక్రియ జరుగుతుందని అధికారులు వెల్లడించారు.
త్వరగా ఇళ్లు కట్టుకునేలా వసతులు
వేలం వేసే ప్రాజెక్టుల్లో ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి అంతర్గత రోడ్లు, వీధి దీపాలు తదితర మౌలిక వసతులను పూర్తిచేస్తారు. ఎటువంటి చిక్కుల్లేని వివాద రహిత ఓపెన్ ప్లాట్లలో వెంటనే నిర్మాణాలు చేపట్టేలా అనుమతులు కూడా ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఈ ప్రాజెక్టుల్లో రెసిడెన్షియల్, ఇతర అవసరాలకు వీలుగా ప్లాట్లను 60 చదరపు గజాల నుంచి గరిష్టంగా 315 చదరపు గజాల వరకు విభజించారు. పెద్ద ప్లాట్లు, అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాల కోసం 6,500 చదరపు గజాల విస్తీర్ణమున్న స్థలాలను కూడా వేలంలో విక్రయిస్తారు.
ఇప్పటికే వేలం వేసే ప్రాజెక్టుల స్థితిగతులపై సంబంధిత జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. వేలానికి సంబంధించిన విధి విధానాలను ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సంబంధిత జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఖరారు చేశారు. మహబూబ్‌నగర్, గద్వాల, నల్లగొండ జిల్లాల్లో వేలం నిర్వహణ బాధ్యతలను హెచ్‌ఎండీఏకు అప్పగించగా.. రంగారెడ్డి, కామారెడ్డి, పెద్దపల్లి, ఆసిఫాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగే వేలాన్ని టీఎస్‌ఐఐసీ పర్యవేక్షిస్తుంది.
హైదరాబాద్‌లో స్పందనను బట్టి..
గతేడాది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ భూములకు హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ ‘ఈ–వేలం’ నిర్వహించగా భారీ స్పందన వచ్చింది. ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.2 వేల కోట్ల మేర ఆదాయం లభించింది. ఖానామెట్, కోకాపేట, ఉప్పల్ భగా యత్, పుప్పాలగూడ తదితర కీలక ప్రాంతాల్లో ఎక రానికి అప్‌సెట్ ధర సగటున రూ.25 కోట్లుగా నిర్ణ యించగా.. గరిష్టంగా రూ.60 కోట్ల వరకు కూడా ధర పలికింది. ఈ నేపథ్యంలో జిల్లాల్లోనూ నిర్వ హించే భూముల వేలానికి మంచి ధర వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వచ్చే నెలలో నిర్వ హించే వేలంలో శేరిలింగంపల్లిలోని మూడు ప్లాట్లకు చదరపు గజానికి గరిష్టంగా రూ.40 వేలు అప్‌సెట్ ధర నిర్ణయించగా.. జిల్లాల్లో అప్‌సెట్‌ను రూ.5 వేల నుంచి రూ.10 వేల మధ్య నిర్ణయించారు.
‘స్వగృహ’ ఆగిపోవడంతో..
మధ్యతరగతి వారికి మార్కెట్ ధరతో పోలిస్తే 25% తక్కువ ధరకు ఇండ్లు నిర్మించి ఇచ్చే లక్ష్యంతో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ‘రాజీవ్ స్వగృహ’ పథకాన్ని ప్రారంభించింది. తెలంగాణలో జీహెచ్‌ఎంసీ సహా 15చోట్ల రాజీవ్ స్వగృహ ప్రాజెక్టులను ప్రారంభించారు. వివిధ కారణాలతో ఇవి మధ్యలో నిలిచిపోయాయి. చాలాచోట్ల ఓపెన్ ప్లాట్లతోపాటు నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లు, ఇళ్లు నిరుపయోగంగా ఉండిపోయాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాలను వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment