సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలుర కన్నా బాలికలే ఎక్కువ శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్‌లో 76 శాతం ఫలితాలతో మేడ్చల్ మొదటి స్థానంలో, 74 శాతంతో హనుమకొండ రెండో స్థానంలో నిలిచింది. రెండో ఏడాదిలో సైతం 78 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ మొదటి స్థానంలో నిలువగా, 77 శాతంతో కుమురం భీం ఆసిఫాబాద్ రెండో స్థానంలో ఉంది. మే నెలలో జరిగిన ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోవిడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, సీజీజీ డైరెక్టర్ ఖాలిక్, పరీక్షల విభాగం ఓఎస్‌డీ సుశీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫస్టియర్‌లో..:
ఫస్టియర్‌లో మొత్తం 4,64,892 మంది పరీక్ష రాశారు. వీరిలో 2,94,378 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎక్కువ మంది (1,93,925) ‘ఎ’గ్రేడ్ సాధించారు. 63,501 మంది ‘బి’గ్రేడ్, 24,747 మంది ‘సి’గ్రేడ్, 12,205 మంది ‘డి’గ్రేడ్ సాధించారు. బాలికలు 2,33,210 మంది పరీక్ష రాస్తే, 1,68,692 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 2,31,682 మందికి గాను 1,25,686 మంది పాసయ్యారు.
సెకెండియర్..
ద్వితీయ సంవత్సరంలో మొత్తం 4,42,895 మంది పరీక్ష రాశారు. వీరిలో 2,97,458 మంది పాసయ్యారు. ఈ సంవత్సరంలో కూడా ఎక్కువమందికి (1,59,432) ‘ఎ’గ్రేడ్ వచ్చింది. 82,501 మంది ‘బి’గ్రేడ్, 35,829 మంది ‘సి’గ్రేడ్, 18,243 మంది ‘డి గ్రేడ్’సాధించారు. 2,19,271 మంది బాలికలు పరీక్ష రాస్తే 1,65,060 మంది, 2,23,624 మంది బాలురుకు గాను 1,32,398 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ: సబిత
ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఆగస్టు ఒకటి నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబిత తెలిపారు. ఈ నెల 30 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని, ఆగస్టు చివరి నాటికి ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. కోవిడ్ కాలంలోనూ విద్యా ప్రమాణాల మెరుగుదలకు అధికారులు తీసుకున్న చొరవను అభినందించారు. ఒకే క్లిక్‌లో ఇంటర్ ఫస్టియర్, సెంకడ్ ఇయర్ ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.
ఎంపీసీలోనే ఎక్కువ ఉత్తీర్ణత
ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీ గ్రూపు విద్యార్థులే ఎక్కువమంది ఉత్తీర్ణులయ్యారు. రెండు సంవత్సరాల్లోనూ 70 శాతానికిపైగా విద్యార్థులు పాసయ్యారు. రెండో స్థానంలో బైసీపీ ఉంటే, హెచ్‌ఈసీ, సీఈసీ గ్రూపుల విద్యార్థుల ఉత్తీర్ణత 50 శాతానికి కూడా చేరుకోలేదు.
ఉత్తీర్ణత ఇలా..
ఫస్టియర్ : 63.32%
సెకెండియర్: 67.16%
ఫస్టియర్:
బాలికలు: 63.32%
బాలురు: 54.25%
సెకెండియర్:
బాలికలు: 75.28%
బాలురు: 59.21%
గ్రూపుల వారీగా ఉత్తీర్ణత శాతం
ఫస్టియర్ సెకెండియర్
ఎంపీసీ 76.3 79.6
బైపీసీ 71.9 75.3
సీఈసీ 44.4 47.7
హెచ్‌ఈసీ 31.8 45.7
ఎంఈసీ 64.7 69.4
–––––––––
2018–22 వరకూ ఇంటర్ జనరల్ (ఒకేషనల్ కాకుండా) విభాగంలో ఫలితాలు (శాతాల్లో) ఇలా...
ఫస్టియర్ సెకెండియర్
2018 62.74 67.08
2019 60.60 64.94
2020 61.07 69.61
2021 100 100
2022 64.85 68.88
(నోట్: 2021లో కోవిడ్ వల్ల పరీక్షలు లేకుండానే పాస్ చేశారు)
Comments
Please login to add a commentAdd a comment