![TS Medical And Health Department Decided To Provide Spectacles - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/23/spects.jpg.webp?itok=fzWxtNBY)
సాక్షి, హైదరాబాద్: జవనరిలో ప్రారంభమయ్యే కంటివెలుగు రెండోవిడత కార్యక్రమంలో 55 లక్షలమందికి కళ్లద్దాలు ఇవ్వాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అందులో అక్కడికక్కడే 30 లక్షల రీడింగ్ గ్లాసులు, 25 లక్షల చత్వారీ కళ్లద్దాలు ఇవ్వనున్నారు. అవసరమైన కళ్లద్దాల కోసం సంబంధిత కంపెనీలతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఆపరేషన్ అవసరమైనవారి పేర్లను నమోదు చేసుకొని ప్రభుత్వ, ప్రైవేట్, ఎన్‌జీవో సంస్థల ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో చేస్తారు.
ఈ మేరకు ఆయా ఆసుపత్రులతోనూ అధికారులు చర్చిస్తున్నారు. కంటివెలుగు నిర్వహణకుగాను రాష్ట్రవ్యాప్తంగా 1,500 బృందాలను ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఆప్తమాలజిస్టులు చాలామంది కంటివెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసారి కూడా వారిని నియమిస్తారు. అందుకు సంబంధించి జిల్లాల్లో త్వరలో నోటిఫికేషన్ జారీచేస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 తేదీ నుంచి కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కంటివెలుగు పథకం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి కావాల్సిన వారందరికీ ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించి కళ్లద్దాలు పంపిణీ చేస్తారు. ఐదు నెలలపాటు కోటిన్నర మందికి కంటి పరీక్షలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment