సాక్షి, హైదరాబాద్: చిన్న మొత్తాలను పెద్ద ఆదాయంగా మలుచుకొనేందుకు టీఎస్‌ఆర్టీసీ మరోసారి ప్రయత్నం ప్రారంభిస్తోంది. వంద రోజులపాటు ఆర్టీసీలో స్పేర్ బస్సులు సహా మొత్తం బస్సులను రోడ్డెక్కించడంతోపాటు ప్రత్యేక మార్పుచేర్పులు, కొత్త ప్రయత్నాలతో భారీ ఆదాయాన్ని పొందాలని నిర్ణయించింది. దీనికి ‘టార్గెట్ 100 డేస్’గా పేరు పెట్టింది. ఈ నెల 23 నుంచి జూన్ 30 వరకు దీన్ని కొనసాగించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు.
ఈ వంద రోజుల్లో సిబ్బంది అత్యవసరమైతే తప్ప సెలవులు పెట్టరాదన్నారు. వీక్లీ ఆఫ్‌లలో సిబ్బంది ‘పరిరక్షణ బృందాలు’గా ఏర్పడి రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులెక్కేలా చూడాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజూ కనీసం 70 వేల కి.మీ. మేర బస్సులన్నీ కలిపి అదనంగా తిరగాలని లక్ష్యం నిర్దేశించారు.
వంద రోజుల్లో కనీసం రూ. 200 కోట్ల మేర అదనపు ఆదాయం పొందాలని ఆర్టీసీ భావిస్తోంది. గతేడాది వేసనిలో ప్రయోగాత్మకంగా వంద రోజుల చాలెంజ్‌ను అమలు చేయగా అప్పట్లో రూ. 178 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. అలాగే గతేడాది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలలో ‘ఆల్ డిపోస్ ప్రాఫిట్ చాలెంజ్’పేరుతో మరో కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా సైతం భారీ ఆదాయం లభించింది. దీంతో ఇప్పుడు మరింత ఆదాయం కోసం ఆర్టీసీ కసరత్తు చేస్తోంది.
ఇవీ లక్ష్యాలు
► ప్రతి ట్రిప్పులో కనీసం నలుగురు నుంచి ఆరుగురు ప్రయాణికులు అదనంగా బస్సులు ఎక్కేలా డ్రైవర్, కండక్టర్లు చొరవ చూపాలి.
►రద్దీ ఎక్కువగా ఉండే పాయింట్ల వద్ద అవసరమైతే రెండు నిమిషాలపాటు అదనంగా బస్సులను ఆపాలి.
►ట్రాఫిక్ ఎక్కువగా ఉండే పాయింట్ల వద్ద ఆర్టీసీ ‘పరిరక్షణ బృందాలు’ప్రైవేటు వాహనాల్లో వెళ్లేందుకు మొగ్గు చూపుతున్న ప్రయాణికులను బస్సుల వైపు మళ్లేలా చూడాలి.
►వేసవిలో బస్సు ట్రిప్పులు మధ్యాహ్నం వేళ తగ్గించి ఉదయం, రాత్రిళ్లలో పెంచాలి.
►ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు అవసరమైతే రాత్రి వేళ బస్సులు తిప్పే మూడో షిఫ్టును కూడా అమలు చేయాలి.
►అదనపు సమయంలో పనిచేసిన సిబ్బందికి కి.మీ.కు రూ.2 చొప్పున అదనంగా చెల్లించాలి. అద్దె బస్సులను కూడా అదనపు ట్రిప్పులకు వినియోగించాలి.
►రాత్రివేళ మెయింటెనెన్స్ చేసే బస్సులకు పగటి వేళనే ఆ ప్రక్రియ పూర్తి చేసి రాత్రి వేళ ట్రిప్పులకు వినియోగించాలి.
►పరీక్షలు పూర్తయ్యాక గ్రామాలకు తిప్పే సరీ్వసుల్లో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) తక్కువగా ఉండే సరీ్వసులను గుర్తించి వాటిని రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతాలకు మళ్లించాలి.
►డిమాండ్ ఎక్కువగా ఉండే రోజుల్లో టార్గెట్‌ను మించి బస్సులు ఎక్కువ కి.మీ. తిరగాలి. ఒకటి రెండు పాయింట్లలో గ్రౌండ్ బుకింగ్ కోసం కండక్టర్లను పెట్టి, బస్సులను కండక్టర్ సరీ్వస్ లేనివిగా ఎక్కువ తిప్పాలి.
►నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికులను తరలించే వారిపై చర్యలు తీసుకొనేందుకు రవాణా, పోలీసు శాఖలతో కలిసి స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలి.
Comments
Please login to add a commentAdd a comment