సాక్షి, హైదరాబాద్: చూడగానే తళతళ మెరిసేలా, ఎక్కగానే కళకళలాడేలా ఆర్టీసీ బస్సు కొత్తదనాన్ని సంతరించుకుంటోంది. రంగులు, హంగులతో ప్రయాణికులను ఆకట్టుకునేలా ముస్తాబవుతోంది. కొత్తగా అనిపించేలా మురిపించనుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బస్సులన్నింటికీ కొత్తగా రంగులేస్తున్నారు. ఎక్కడికక్కడ డిపోల్లో ఆర్టీసీ గ్యారేజీ సిబ్బంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు.
అప్పట్లో ఆదాయం కోసం ఆర్టీసీ బస్సులపై వాణిజ్య ప్రకటనలకు అవకాశం కల్పించారు. ఆ ప్రకటనలు వినాయిల్ షీట్లతో రూపొందించిన పోస్టర్లను బస్సులపై అతికించేవారు. దీంతో బస్సుల అసలు రంగులు ఏమిటో తెలుసుకోవడం గగనమయ్యేది. ప్రకటన గడువు తీరగానే ఆ పోస్టర్లను పీకేస్తుండటంతో దానికుండే జిగురు కొంత అలాగే ఉండిపోయి, దానికి దుమ్ము, ధూళి అంటుకుని బస్సులు అందవిహీనంగా కనిపిస్తూ వచ్చాయి. మరోవైపు ప్రకటనల కారణంగా, ఆ బస్సు ఎక్స్‌ప్రెస్సా, ఆర్డినరీనా అనేది తెలియకుండా పోయింది. దీన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రంగా పరిగణించారు. బస్సులపై ప్రకటనల విధానానికి చెక్ పెట్టారు. ఆ బస్సులన్నింటికీ కొత్త రంగులు వేసి కొత్తవాటిల్లా మెరిసేలా చేయాలని ఆదేశించారు. దినేశ్‌రెడ్డి ఆర్టీసీ ఎండీ ఉండగా బస్సులకు రంగులు మార్పించారు. ఇంకా అవే కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుత రంగుల డిజైన్ బాగానే ఉందని ఎక్కువమంది అధికారులు అభిప్రాయపడటంతో వాటినే కొనసాగించాలని నిర్ణయించి, ఆ మేరకు రంగులేస్తున్నారు.
సొంత డిపోల్లోనే..
ఆర్టీసీకి ప్రతి డిపోలో సొంత గ్యారేజీలున్నాయి. నిపుణులైన సిబ్బంది ఉన్నారు. ఎండీ ఆదేశాల మేరకు ఏ డిపో బస్సులకు ఆ డిపోలోనే సొంత సిబ్బందితో రంగులద్దిస్తున్నారు. ట్రిప్పులకు ఇబ్బంది లేకుండా రోజుకు ఒకటి, రెండు చొప్పున బస్సులను మాత్రమే డిపోలో ఉంచి రంగులేస్తున్నారు. దీంతో అన్ని బస్సులకు రంగుల ప్రక్రియ పూర్తి చేయటానికి డిసెంబర్ చివరి వరకు సమయం పట్టే అవకాశం ఉంది.
అప్పట్లో రూ.4 కోట్ల దుబారా..
మహిళాప్రయాణికులకు వేధింపులు ఎక్కువయ్యాయనే ఫిర్యాదులు రావడంతో అధికారులు కొంతకాలం క్రితం సిటీ బస్సుల్లో ప్రత్యేక పార్టిషన్ తెరలు ఏర్పాటు చేశారు. అల్యూమినియం ఫ్రేములు అమర్చి దానికి డోర్ బిగించారు. మహిళలు ముందు వైపు పరిమితం కాగా, పురుషులు అటుగా వెళ్లేందుకు వీలులేకుండా చేయటం దీని ఉద్దేశం. ఈ ఫ్రేములు బిగించే పనిని డిపోల్లో గ్యారేజే సిబ్బందికి కాకుండా ఓ ఉన్నతాధికారి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ఇందుకు రూ.4 కోట్లకుపైగా అప్పట్లో ఖర్చయినట్టు సమాచారం. ఈ విషయంలో అవినీతి జరిగిందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తినా నాటి ఎండీ పట్టించుకోలేదు. ఇప్పుడు చాలా ఫ్రేములు వినియోగంలో లేవు. దీంతో రూ.4 కోట్ల వ్యయం వృథాగా మారినట్టయింది.
Comments
Please login to add a commentAdd a comment