
సాక్షి, హైదరాబాద్: పనిచేసే ప్రాంతంలో అధి కారులు, సిబ్బంది నివాసం ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారులు, సిబ్బందికి సర్క్యులర్ జారీచేశారు. ఇంతకాలం ఆర్టీసీలో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ లో ఉంటూ పనిచేసే ఇతర ప్రాంతానికి నిత్యం వస్తూ పోతుండేవారు కూడా ఉన్నారు. చాలా కాలంగా ఫిర్యాదులున్నా పట్టించుకోలేదు. దీనిపై ఎండీ సజ్జనార్‌కు కూడా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని ఆయన తీవ్రంగా పరిగణించారు.
స్థానికంగా ఉంటున్న ఇంటి చిరునామాలను వెంటనే అందజేయాలని ఆదేశించటం విశేషం. ఇటీవలే ఈడీ స్థాయి మొదలు డిపో మేనేజర్ వరకు మూకుమ్మడి బదిలీలు జరి గాయి. అయితే, నలుగురైదుగురు రాజీనామా చేయగా, పదిమంది వరకు సెలవులో వెళ్లారు. ఈ నేపథ్యంలో కొందరు వేరే ప్రాంతాల్లో ఉంటూ పనిచేసే ప్రాంతానికి వెళ్లి వస్తున్నారు. దీన్ని సజ్జనార్ గమనించి తప్పని పరిస్థితిలో మినహా, కుటుంబాలతో కలసి పనిచేసే ప్రాంతాల్లోనే ఉండాలంటూ లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీచేశారు.