హైదరాబాద్: దసరా పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పండగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రత్యేక బస్సులకు గానూ..టీఎస్‌ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకలకు కూడా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ఈనెల 8 నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి.
దీని కోసం అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్లు టీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సులలో టికెట్ ఛార్జీకి అదనంగా 50 శాతం రుసుము వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పండగకు మొత్తం.. 4035 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఎంజీబీఎస్ నుంచి 3,200 బస్సులు, జేబీఎస్ నుంచి 1200 బస్సులు తెలంగాణ, ఏపీకి నడవనున్నాయి. ఇవికాకుండా మరికొన్ని బస్సులు అదనంగా తిప్పేందుకు అధికారులు నిర్ణయించారు.
ఏపీతోపాటు తెలంగాణలోని ఖమ్మం, ఆదిలాబాద్, మంచిర్యాల,నిజామాబాద్ లాంటి ప్రాంతాలకు ముందస్తు బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించారు. దీంతో పండగకు రూ. 3 నుంచి రూ.4 కోట్ల ఆదాయం చార్జీల రూపంలో వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కరీంనగర్,ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ బస్సులు జేబీఎస్ నుంచి బయలుదేరుతుండగా.. వరంగల్, మహబూబాబాద్‌కు వెళ్లే బస్సులు ఉప్పల్ నుంచి బయలు దేరనున్నాయి.
అదే విధంగా ఖమ్మం, విజయవాడకు వెళ్లే బస్సులు.. ఎల్బీనగర్, హయత్‌నగర్ నుంచి, నల్లగొండ, మహబూబ్‌నగర్‌కు వెళ్లే బస్సులు దిల్‌సుఖ్‌నగర్ నుంచి బయలుదేరతాయిని అధికారులు తెలిపారు. అదే విధంగా, వైఎస్సార్ కడప జిల్లా, కర్నూలు, అనంతపురం జిల్లాలకు వెళ్లే బస్సులు సీబీఎస్ నుంచి బయలుదేరతాయని టీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment