ఖమ్మం: ఒకే రూపం కలిగిన ఇద్దరు పిల్లలు ఒకే ఇంట్లో ఉంటే.. గొప్ప అనుభూతే. కవలలంటే ఇష్టపడని హృదయముండదు. ఒకే పోలిక ఉంటే ఆనందంతోపాటు బంధువులు, ఇరుగుపొరుగులో కన్‌ఫ్యూజన్ కూడా ఉంటుంది. కొందరు ఆ ఇంట్లో ఒకే బిడ్డ ఉన్నాడని అనుకుంటూ ఉంటారు. నేడు కవలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
అలీఫా, అఫియా
నగరంలోని ముస్తాఫానగర్‌కు చెందిన హోంగార్డు షేక్ అక్బర్ అలీకి 2010 మార్చి 18న కవలలు జన్మించారు. షేక్ అలీఫా తబసుమ్, షేక్ అఫియా తబసుమ్ ఇద్దరూ ఒకేలా ఉంటారు. వీరిని స్నేహితులు గుర్తుపట్టడం కూడా కష్టమే. వీరు స్థానిక లోటస్ పాఠశాలలో చదువుకుంటున్నారు. అలీఫా , అఫియాలను బంధువులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఒకే పోలికలతో ఆడపిల్లలు ఇంట తిరుగుతుంటే ఎంతో సంతృప్తిగా అనిపిస్తుందని తాత మహబూబ్ అలీ గారాబం చేస్తారని ఈ అక్కాచెల్లెళ్లు ఆనందంగా చెబుతున్నారు.
నయోనిక, నైతిక్ కుమార్
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగరానికి చెందిన కె.వినోద్‌కుమార్, శ్రీదివ్య దంపతుల పిల్లలు కె.నయోనిక, నైతిక్‌కుమార్ కవలలు. వీరి వయసు ఇప్పుడు పదేళ్లు. వీరిద్దరూ ఇంట్లో, బయట కూడా ఐక్యంగా ఉంటారని తల్లిదండ్రులు చెబుతున్నారు.
అనుదీప్, మనుదీప్
నగరంలోని త్రీటౌన్ పంపింగ్‌వెల్ రోడ్‌కు చెందిన తలారి సురేష్, మహాలక్ష్మి దంపతులకు కవల పిల్లలు అనుదీప్, మనుదీప్ ఒకరినొకరు పోలి ఉంటారు. తొమ్మిదేళ్ల వయసున్న వీరిలో ఎవరు అనుదీపో?ఎవరు మనుదీపో? అర్థంకాగా తికమకపడుతుంటారు. తండ్రి సురేష్ వ్యవసాయ మార్కెట్‌లో పనిచేస్తాడు.
జార్జి విహాన్, అన్నిక మెర్ల
వైరా మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపలిటికి చెందిన గొల్లమందల రాజు, అనిత దంపతులకు మూడేళ్ల కిందట కుమారుడు, కుమార్తె (జార్జి విహాన్, అన్నిక మెర్లీ) కవలలుగా జన్మించారు. ఇద్దరు అచ్చం ఒకేలా ఉంటారు. ఒకరిని ఒకరు విడిచి ఉండలేరు.
వర్షిణి–హర్షిణి
నేలకొండపల్లి: మండలంలోని బైరవునిపల్లి గ్రామంలో గోపి ఉపేందర్‌రావు–నాగలక్ష్మి దంపతుల పిల్లలు వర్షిణి–హర్షిణి కవలలు. వీరికి డ్రస్, పుస్తకాలు, చివరకు తినే పదార్థాలలో కూడా సేమ్ టు సేమ్. వీరి అభిరుచులను చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. ముద్దుగా కిట్టు...బిట్టు అని పిలుస్తారు.
హిమ కర్షిణి, హిమ వర్షిక
వైరారూరల్: సిరిపురం గ్రామానికి చెందిన కూరాకుల సాయిబాబా, స్రవంతి దంపతులకు ఇద్దరు కూతుళ్లు కవలలుగా జన్మించారు. హిమ కర్షిణి, హిమ వర్షికలకు ప్రస్తుతం నాలుగేళ్లు. వీరు అచ్చం ఒకేలా ఉంటారు.
అలోక్, అయాన్
ఖమ్మంసహకారనగర్: ఖమ్మం రూరల్ మండలంలోని శ్రీ సిటీలో నివసించే పునాటి మనోజ్, హర్మ్య దంపతులకు కవలలు అలోక్, అయాన్. వీరికి నాలుగేళ్ల వయసు. ఏ వస్తువు కొనుగోలు చేసినా ఇద్దరికీ కావాలని పట్టుబడతారని, అందుకే ఏదైనా చెరొకటి కొంటామని తల్లిదండ్రులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment