కోటపల్లి (చెన్నూర్): ‘కేసీఆర్ సార్.. ప్లీజ్ నోటిఫికేషన్లు ఇవ్వండి. నాలా బాధపడేవారు చాలామంది చావడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి వారినైనా కాపాడండి. మీ కాళ్లు పట్టుకుంటా. అమ్మా నాన్నా క్షమించండి.. మన ఇంటి పరిస్థితి బాగాలేదు. కానీ జాబ్ లేక, మీ మీద ఆధారపడి జీవించలేక ఈ నిర్ణయం తీసుకున్నా. నా చావుతోనైనా ఉద్యోగ ప్రకటనలు వెలువరించాలి. నిరుద్యోగుల ఆత్మహత్యల్లో నాదే చివరిది కావాలి’అని ఓ నిరుద్యోగి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లాలో శనివారం రాత్రి జరిగింది.
కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. కోటపల్లి మండలం బబ్బరుచెల్క గ్రామానికి చెందిన అసంపెల్లి శివక్క– వెంకన్న దంపతులకు కుమారుడు మహేశ్ (23)తోపాటు ఒక కుమార్తె ఉంది. కూతురుకు పెళ్లిచేశారు. మహేశ్‌ను డీఎడ్, డిగ్రీ చదివించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఉద్యోగం కోసం రెండేళ్లుగా ప్రిపేర్ అవుతున్నారు. నోటిఫికేషన్లు రాకపోవడంతో చెన్నూర్‌లోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో చేరారు.
ఇటీవల ఆ కంపెనీని మూసివేయడంతో నాలుగు నెలలుగా మహేశ్ ఇంటి వద్దనే ఉంటున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ రాకపోవడంతో కలత చెంది సూసైడ్ లెటర్ రాశారు. లెటర్‌ను ఇంట్లో పెట్టి బయటకి వెళ్లిపోయారు. ఈ లెటర్‌ను చూసిన కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో మహేశ్ తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒక్కగానొక్క కొడుకు ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
ఆదివారం ఉదయం 63వ నంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న రైస్‌మిల్ సమీపంలోని పత్తి చేనులో మహేశ్ విగతజీవిగా కనిపించాడు. వెంటనే స్థానికులు పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. జైపూర్ ఏసీపీతోపాటు సీఐలు, ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వైద్యులను అక్కడికే రప్పించి మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. మహేశ్ కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు, అతడి స్నేహితులు ఎన్‌హెచ్–63పై బైఠాయించారు.
బాధిత కుటుంబానికి 4 ఎకరాల భూమి, 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏసీపీ నరేందర్ మహేశ్ తల్లిదండ్రులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అనంతరం మహేశ్ అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు వాంగ్మూలం ఇచ్చారని సీఐ నాగరాజు చెప్పారు.
జాతీయ రహదారిపై అందోళన చేస్తున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు
Comments
Please login to add a commentAdd a comment