ప్రహ్లాద (ఫైల్), ప్రహ్లాద మృతదేహం
ఒకటి కాదు.. రెండు కాదు.. 600 హామీల్లో ప్రభుత్వం ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయింది. నిరుద్యోగుల జీవితాల్లోనూ ఆశలు రేపి ఉసురు తీస్తోంది. ఈ కోవలోనే గుంతకల్లుకు చెందిన ప్రహ్లాద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గుంతకల్లు టౌన్: పట్టణంలోని హనుమేష్‌నగర్‌కి చెందిన కరణం ప్రహ్లాద (45) అనే నిరుద్యోగికి ఉద్యోగవకాశాలు రాక , ఒంటరి జీవితం గడపలేక జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి మృతుడి సోదరుడు సంతోష్‌కుమార్, వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలమేరకు... పట్టణానికి చెందిన ప్రహ్లాద డిప్లమో ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. కొన్నేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలోని సీఎన్‌సీ మిషన్ ఆపరేటర్‌గా పనిచేశాడు.
గుత్తికి చెందిన విద్య అనే మహిళతో వివాహం కూడా జరిగింది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. కుటుంబ కలహాల కారణంగా కొన్నేళ్ల క్రితం వారు విడాకులు తీసుకున్నారు. అయితే మూడేళ్ల నుండి ఉద్యోగం కోల్పోయిన ప్రహ్లాద తనకు ఉద్యోగం రావడం లేదని కుటుంబ సభ్యులతో మంగళవారం రాత్రి బాధపడ్డాడు. బుధవారం సాయంత్రమైనా అతను బయటికిరాకపోగా, సెల్‌ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన సోదరుడు సంతోష్, బంధువులు బుధవారం రాత్రి అతని ఇంటికి వెళ్లిచూడగా ఉరితాడుకు వేలాడుతున్నారు. దీంతో వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. ఉద్యోగం లేక ఒంటరి జీవితం గడపలేకనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని వారు తెలియజేశారు. ప్రహ్లాద మృతదేహానికి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు శవపరీక్షలు నిర్వహించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment