ప్రేమ వ్యవహారమేనా..? | Two suicides for different reasons In Anantapur district | Sakshi
Sakshi News home page

ప్రేమ వ్యవహారమేనా..?

Published Mon, Jul 22 2019 8:22 AM | Last Updated on Mon, Jul 22 2019 8:32 AM

Two suicides for different reasons In Anantapur district - Sakshi

సాక్షి, యాడికి: చదువు పూర్తయినందున ఉద్యోగం చేయాలని చెప్పినందుకు యువకుడు.. చేస్తున్న ఉద్యోగం మానుకోవాలని తల్లిదండ్రులు చెప్పినందుకు యువతి మనస్తాపానికి గురై బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరిరువురూ ఒకే ఊరు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో గ్రామం శోకసంద్రంగా మారింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. యాడికి మండలం నగరూరుకు చెందిన రంగనాథచౌదరి, సరస్వతి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు వినోద్‌కుమార్‌ (26) బీటెక్‌ వరకు చదివి, ఇంటి వద్ద ఉంటున్నాడు. అప్పు చేసి చదివించానని, ఇకనైనా ఉద్యోగం వెతుక్కోవాలని తండ్రి మందలించాడు.

మనస్తాపం చెందిన వినోద్‌కుమార్‌ శనివారం సాయంత్రం విషపుగుళికలు మింగి, ద్విచక్రవాహనంలో సమీపంలోని రాయలచెరువులో ఉన్న తన పిన్నమ్మ వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. వెంటనే వారు అతడిని రాయలచెరువులోని క్లినిక్‌లో ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన వైద్యంకోసం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల సమయంలో వినోద్‌కుమార్‌ మృతి చెందాడు. ఆదివారం ఉదయం కుమారుడి మరణవార్తను గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న తల్లి సరస్వతి అపస్మారకస్థితిలోకి వెళ్లింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు.  

పురుగుమందు తాగి యువతి.. 
నగరూరుకు చెందిన వెంకటచౌదరి, సువర్ణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. డిగ్రీ వరకు చదువుకున్న చిన్న కూతురు చరిత (26) తిరుపతిలో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. ఇటీవల గురుపౌర్ణమి వేడుకలకు స్వగ్రామం వచ్చింది. పెళ్లి సంబంధాలు చూస్తున్నామని, ఉద్యోగం మానుకోవాలని తల్లిదండ్రులు శనివారం చెప్పారు. ఉద్యోగం మానుకోవడం ఇష్టం లేని చరిత అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లోనే పురుగుమందు తాగి బాధతో కేకలు వేసింది. తల్లిదండ్రులు హుటాహుటిన రాయలచెరువులో ప్రథమ చికిత్స చేయించుకుని, మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో చరిత చనిపోయింది. ఒకే రోజు ఒకే సామాజిక వర్గానికి చెందిన యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు రోదనలు మిన్నంటాయి. 

ప్రేమ వ్యవహారమేనా! 
నగరూరులో ఆత్మహత్య చేసుకున్న వినోద్‌కుమార్, చరిత కుటుంబాలు దగ్గరి బంధువులుగా తెలుస్తోంది. స్నేహంగా మెలిగే వీరు ఒకే రోజు గంటల వ్యవధిలో బలవన్మరణాలకు పాల్పడటం కలకలం రేపుతోంది. వీరి మృతికి ప్రేమ వ్యవహారం కారణమై ఉండొచ్చని గ్రామస్తులు మాట్లాడుకోవడం చర్చనీయాంశంగా మారింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement