త్వరలోనే ప్రారంభం 98 శాతం పనులు పూర్తైనట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటన
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక హంగులతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రయాణికులకు సకల సదుపాయాలతో ఎయిర్‌పోర్టు తరహాలో చర్లపల్లి టెర్మినల్‌ను తీర్చిదిద్దారు. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌లపైన ఒత్తిడిని తగ్గించేందుకు నాలుగో టెర్మినల్‌గా దక్షిణమధ్య రైల్వే చర్లపల్లి పునరి్నర్మాణం చేపట్టింది. సుమారు రూ.434 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు 98 శాతం పూర్తయినట్లు స్వయంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల కంటే ముందే దీన్ని వినియోగంలోకి తేవాలని భావించినప్పటికీ అప్పట్లో ఇంకా కొన్ని పనులు మిగిలిపోవడం వల్ల సాధ్యం కాలేదు. ఆ తరువాత ఎన్నికల కోడ్ వచ్చేసింది. ప్రస్తుతం దాదాపుగా పనులన్నీ పూర్తి కావడంతోనే త్వరలోనే చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు.
రోజుకి 50 రైళ్ల రాకపోకలకు అవకాశం
సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్న దృష్ట్యా ప్రస్తుతం సికింద్రాబాద్ వరకు రాకపోకలు సాగిస్తున్న కొన్ని రైళ్లను త్వరలో చర్లపల్లి నుంచి నడుపనున్నారు. 9 ప్లాట్‌ఫామ్‌లతో ఏర్పాటు చేసిన చర్లపల్లి నుంచి రోజుకు 50 రైళ్లు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం 30 రైళ్లతో (15 జతలు) చర్లపల్లి స్టేషన్‌ను వినియోగంలోకి తేనున్నారు. మొదట 25 వేల మందికి పైగా చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనున్నారు. రైళ్లు పెరిగే కొద్దీ ప్రయాణికుల సంఖ్య పెరగనుంది.
ఔటర్‌కు చేరువలో...
⇒ ఔటర్‌రింగ్ రోడ్డుకు చేరువలో ఉన్న చర్లపల్లి స్టేషన్‌కు నగరవాసులు వివిధ ప్రాంతాల నుంచి ఔటర్ మీదుగా చేరుకొనేందుకు అవకాశం ఉంది. మరోవైపు ఎంఎంటీఎస్ రెండో దశలో విస్తరించిన సికింద్రాబాద్–ఘట్కేసర్ రూట్‌లో ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలు కూడా ప్రారంభం కానున్నాయి.
⇒ దీంతో ప్రయాణికులు నగరానికి పడమటి నుంచి తూర్పు వైపు తేలిగ్గా రాకపోకలు సాగించవచ్చు.
⇒ ప్రయాణికుల సదుపాయాల్లో భాగంగా 5 లిఫ్టులు, 9 ఎస్కలేటర్లు ఉన్నాయి. విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు సోలార్ పవర్
ప్రాజెక్టును చేపట్టారు.
⇒ ప్రయాణికుల రాకపోకల కోసం రెండు సబ్‌వేలను నిర్మించారు. అలాగే రహదారులను విస్తరించారు. సుమారు 4 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంకర్‌లను సిద్ధం చేశారు.
చర్లపల్లి నుంచి నడిచే రైళ్లు ఇవే...
⇒ షాలిమార్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18045/18046),.
⇒ చెన్నై నుంచి నాంపల్లి స్టేషన్‌కు నడిచే చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (12603/12604)
⇒ గోరఖ్‌పూర్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగించే (12589/12590) గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్..
⇒ హైదరాబాద్–సిర్పూర్‌కాగజ్‌నగర్ (17011/17012), సికింద్రాబాద్–సిర్పూర్‌కాగజ్‌నగర్ (12757/12758),
⇒ గుంటూరు–సికింద్రాబాద్ (17201/17202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–సిర్పూర్‌కాగజ్‌నగర్ (17233/17234) భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్..
⇒ విజయవాడ–సికింద్రాబాద్ (12713/12714) శాతవాహన ఎక్స్‌ప్రెస్, గుంటూరు–సికింద్రాబాద్ (12705/12706) ఎక్స్‌ప్రెస్, తదితర రైళ్లను చర్లపల్లి నుంచి నడుపనున్నారు.
⇒ మొత్తంగా మొదట 15 జతల రైళ్లు చర్లపల్లి నుంచి ప్రారంభం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment