సబ్‌ప్లాన్ సమీక్షలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఎస్సీ, ఎస్టీ రైతుల ఆదాయాలు పెంచాలి
పట్టణాల్లో ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలులో భాగంగా ప్రభుత్వ శాఖలకు కేటాయించిన నిధులను నూరు శాతం ఖర్చు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుపై ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కేటగిరీలవారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు. సబ్‌ప్లాన్ చట్టం ప్రకారం ప్రభుత్వ శాఖలకు కేటాయించిన నిధులు, చేసిన ఖర్చు వివరాలను ప్రతి నెలా వెల్లడించాలని స్పష్టం చేశారు.
అందుబాటులో ఉన్న నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. సబ్‌ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో ఈ నెల 23న నిర్వహించబోయే సమావేశానికి హాజరు కావాలని శాఖాధిపతులను ఆదేశించారు. బడ్జెటేతర నిధుల వ్యయంలోనూ సబ్‌ప్లాన్ చట్టం ప్రకారం జనాభా దామాషాలో నిధుల ఖర్చు జరిగిందా? లేదా? అనే సంపూర్ణ సమాచారం అందించాలని సూచించారు. సబ్‌ప్లాన్ అమలుకు సంబంధించి గత ఎనిమిదేళ్లలో క్షేత్రస్థాయిలో వివిధ శాఖల్లో అధ్యయనం చేసి సెస్ రూపొందించిన నివేదికపై ఈ సమావేశంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
అటవీ భూముల్లో వాణిజ్య పంటలు
అటవీ భూముల్లో వ్యవసాయ మోటార్లకు సోలార్ విద్యుత్తు వినియోగించాలని భట్టి విక్రమార్క సూచించారు. ఆయా భూముల్లో వెదురు, అవకాడో, పామాయిల్ వంటి వాణిజ్య పంటలతోపాటు అంతర పంటల సాగు ప్రాజెక్టులు డిజైన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పంటలతో ఆదివాసీ, గిరిజన రైతులకు ఆదాయాలు పెరుగుతాయని పేర్కొన్నారు. మూసీ పునర్జీవనం పథకంలో నిర్వాసితులవుతున్న ఎస్సీ, ఎస్టీ మహిళలను స్వయం సహాయక సంఘ సభ్యులుగా చేర్పించి, వారికి వడ్డీ లేని రుణాలు అందించాలని సూచించారు. స్వయం ఉపాధి కింద పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు రవాణా వాహనాలు, క్లీనింగ్ యంత్రాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, సీనియర్ ఐఏఎస్ అధికారులు వికాస్ రాజ్, దాన కిషోర్, ఎన్.శ్రీధర్, శరత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment