కొల్లాపూర్: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడుల నేపథ్యంలో అక్కడ వేలాది మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోవడం మన జాతీయ విద్యావిధానంపై కొత్త చర్చకు తెరలేపిందని ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్, నానో అప్లికేషన్స్ టెక్నాలజీ అడ్వయిజరీ గ్రూప్ (నాటాగ్) చైర్మన్ వలిపె రాంగోపాల్‌రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే జాతీయ విద్యా విధానంలో ఇందుకు సంబంధించి భారీ మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశ విద్యా విధానాన్ని సరళతరం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్‌కు వచ్చిన ఆయన ‘సాక్షి’కి పలు అంశాలను వెల్లడించారు.
మార్పునకు శ్రీకారం చుట్టాలి...
‘దేశంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో సీట్లకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మెడిసిన్ చదివేందుకు మాత్రం ఎక్కువ శాతం మంది విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారు. అక్కడ ఫీజులు తక్కువ ఉండటమే కారణం. ఉక్రెయిన్‌కు చదువు కోసం వెళ్లిన వారిలో అధిక శాతం వైద్య విద్యార్థులే ఉన్నారు. మన దేశంలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలంటే కఠిన నిబంధనలు ఉన్నాయి. వాటిని సవరిస్తేనే విద్యార్థులకు మేలు జరుగుతుంది. జాతీయ విద్యావిధానాన్ని సరళతరం చేయాల్సిన అవసరం ఉంది. ఇండియాలో మాత్రమే ఒక్కో విభాగానికి ఒక్కో యూనివర్సిటీ ఉంది.
ఫారెన్ కంట్రీస్ తరహాలో యూనివర్సిటీల్లో అన్ని విభాగాలను ఒకేచోట అందుబాటులో ఉంచాలి. ఈ మార్పు ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి మేము ప్రారంభించాం. ఢిల్లీ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఐఐటీ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ డిగ్రీ కోర్సును ఈ ఏడాది నుంచి ప్రారంభిస్తున్నాం. ఢిల్లీ ఐఐటీలో మెడిసిన్ పీహెచ్‌డీ కోర్సును ప్రారంభించబోతున్నాం. మున్ముందు దేశంలో ప్రత్యేక యూనివర్సిటీలు ఉండే అవకాశాలు లేవు’అని రాంగోపాల్‌రావు తెలిపారు. దేశంలో ఇంటర్, డిగ్రీతోనే చాలా మంది చదువులు ఆపేస్తున్నారని రాంగోపాల్‌రావు పేర్కొన్నారు. ఉన్నత విద్యకు వెళ్లే వారి సంఖ్య 1:4గా ఉందని, దీనిని 1:2గా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు.
‘నానో’కు కేంద్రం ప్రోత్సాహం...
నానో స్టార్టప్‌లకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోందని రాంగోపాల్‌రావు తెలిపారు. 2003–04లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నేతృత్వంలో నానో మిషన్ ప్రారంభమైందని, మున్ముందు అన్ని రంగాల్లోనూ నానో ప్రభావం ఉంటుందన్నారు. నూతనంగా చేపట్టబోయే స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించేందుకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రూ. 300 కోట్లు కేటాయించిందని వివరించారు. ప్రజలకు మేలు చేసే, ఉపాధి అవకాశాలు పెంపొందించే స్టార్టప్‌లకు ఐఐటీ ఖరగ్‌పూర్ తగిన ప్రోత్సాహం అందిస్తుందన్నారు.
నానో స్నిఫర్.. మైక్రో న్యూట్రిన్స్..
‘నేను నానో స్నిఫర్ అనే టెక్నాలజీని రూపొందించా. భూమిలో అమర్చే మందుపాతరలను ఇది గుర్తిస్తుంది. దీనిని దేశ రక్షణ వ్యవస్థలో వినియోగిస్తున్నారు. ప్రస్తుతం నానో స్నిఫర్‌ను బ్రిటన్ రక్షణ వ్యవస్థలో వాడుతోంది. ఈ ప్రక్రియలో ఎలాంటి ప్రాణనష్టం ఉండదు. వ్యవసాయ రంగంలో ఎరువులు, నీటి వినియోగాన్ని ఆదా చేసేందుకు మైక్రో న్యూట్రిన్స్ టెక్నాలజీని రూపొందిస్తున్నా. ఇది త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల మొక్కలకు ఎంతమేరకు నీళ్లు, ఎరువులు అందించాలనేది తెలుస్తుంది. దీనిని తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఢీల్లీ ఐఏఆర్‌టీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నాం. పదో తరగతి చదివిన వారు సైతం ఈ టెక్నాలజీ సాయంతో పొలాల్లోనే భూసార పరీక్షలు చేయవచ్చు. ఇది అందుబాటులోకి వస్తే దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నానో వస్తువులు సాధారణ వస్తువులకంటే 5 రెట్లు తక్కువ ధరకు లభిస్తాయి’అని రాంగోపాల్‌రావు తెలిపారు.
ఐఐటీ చదివిన వారికి ఇక్కడే ఉపాధి
గత పదేళ్లలో ఐఐటీ చదివిన వారిలో 95 శాతం మంది దేశంలోనే ఉద్యోగాలు చేస్తున్నారని లేదా పరిశ్రమలు స్థాపిస్తున్నారని రాంగోపాల్‌రావు చెప్పారు. కేవలం 5శాతం మందే విదేశాలకు వెళుతున్నారని, ఇది మంచి పరిణామమని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు కంటే ప్రభుత్వ యూనివర్సిటీల్లో నాణ్యమైన విద్య అందుతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉత్తరాది రాష్ట్రాలు మినహా 23 రాష్ట్రాల్లో ఐఐటీ యూనివర్సిటీలు ఉన్నాయని తెలిపారు. హరియాణాలో మాత్రం ఢిల్లీ ఐఐటీకి అనుబంధంగా ఎక్స్‌టెన్షన్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment