లాలాపేట: ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో దాదాపుగా రూ. 120 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ యాదవ్ తెలిపారు. రీఫార్మ ఫర్ఫార్మ్ ట్రాన్స్‌ఫార్మ్‌లో భాగంగా రెండేళ్ల కాలంలో చేపట్టిన సంస్కరణల ప్రగతిని వచ్చే ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. ఓయూ వైస్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బుధవారం ఓయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణతో కలిసి ఇనిషి యేటివ్స్.. ఈవెంట్స్... అచీవ్‌మెంట్స్ 2021–23 పేరుతో రూపొందించిన ప్రగతి నివేదికను ఆవిష్కరించారు.
పాలనా వ్యవస్థను గాడిలో పెట్టడం అకడమిక్ పరిపాలనా వ్యవస్థలను పటిష్టం చేయడం, విద్యా పరిశోధనా రంగాల్లో మేటిగా నిలపడమే ధ్యేయంగా తాము చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. చారిత్రాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ చాన్స్‌లర్‌గా పని చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. మరో వందేళ్ల పాటు ఓయూ తన కీర్తి ప్రతిష్టను కొనసాగించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్రావు, విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో యూనివర్సిటీని విద్యారంగంలో అగ్రగామిగా నిలిపే కార్యక్రమం కొనసాగతోందని స్పష్టం చేశారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌లో ఓయూ 22వ స్థానాన్ని సాధించడం, డబ్ల్యూసీఆర్‌సీ లీడర్స్ ఆసియా వరల్డ్స్ బెస్ట్ బ్రాండ్ 2022 యూకేలోని హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో అవార్డు అందుకోసం తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు.
రూ. 120 కోట్లతో బాయిస్ హాస్టల్స్, శతాబ్ది నూతన పరిపాలనా భవనం, పైలాన్, ఓపెన్ ఎయిర్ థియేటర్‌తో పాటు అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వీసీ వివరించారు. ఓయూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు తక్ష పేరుతో ప్రత్యేకంగా మూడు రోజుల కార్యక్రమాలతో పాటు ఉస్మానియా ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించామన్నారు.
అకడమిక్ కేలండర్‌ను సరిదిద్దడం, ఏటా స్నాతకోత్సవం నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని వీసీ వెల్లడించారు. మార్కెట్‌కు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగు పరచడంతో పలు కొత్త కోర్సులు ప్రవేశపెట్టామన్నారు. ఇంజినీరింగ్‌లో కృత్రిమ మేధ మిషన్ లెరి్నంగ్, మైనింగ్, బీఏ హానర్స్, డిగ్రీలో ఏ కోర్సు చదివిన వారైనా ఆర్ట్స్ సోషల్ సైన్సెస్‌లో పీపీ చేసే వినూత్న అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చామని వీసీ వివరించారు.
ఇది సివిల్ సర్విసెస్ వైపు వెళ్లేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. వివిధ అంశాలపై దాదాపు 10 విదేశీ యూనివర్సిటీలతో ఎంఓయూ చేసుకున్నామన్నారు. ఎలాంటి ఫైరవీలు, ఒత్తిళ్లకు తావు లేకుండా ఆన్‌లైన్ అర్హతా పరీక్షలు, అకడమిక్ మెరిట్ ఆధారంగా అర్హులైన వారికే పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించామన్నారు.
విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, బోధన, బోధనేతర సిబ్బంది యూనివర్సిటీ తీసుకునే నిర్ణయాల్లో భాగస్వాములై ఉస్మానియా యూనివర్సిటీ పతాకాన్ని ప్రపంచ స్థాయిలో ఎగరవేసేందుకు కలిసి రావాలనీ ఓయూ వీసీ రవీందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రొఫెసర్లు స్టీవెన్‌సన్, జి.మల్లేషం, శ్రీరాం వెంకటేష్, గణేష్, వీరయ్య, ప్యాట్రిక్, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు, సీనియర్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment