కష్టపడితే నెలలో ‘గ్రూప్స్‌’ కొట్టొచ్చు | Sakshi Interview With Osmania VC Professor Ravinder | Sakshi
Sakshi News home page

కష్టపడితే నెలలో ‘గ్రూప్స్‌’ కొట్టొచ్చు

Published Fri, Apr 29 2022 3:06 AM | Last Updated on Fri, Apr 29 2022 9:57 AM

Sakshi Interview With Osmania VC Professor Ravinder

సాక్షి, హైదరాబాద్‌: పరీక్షల కోసం కాకుండా, పరిశోధనాత్మకంగా అభ్యాసన చేస్తే గ్రూప్స్‌లోనే కాదు సివిల్స్‌లోనూ రాణిస్తారని ఉస్మానియా యూనివర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్‌ డి.రవీందర్‌ అభిప్రాయపడ్డారు. కోచింగ్‌ సెంటర్స్‌కు వెళ్తేనే పోటీ పరీక్షలో విజయం సాధిస్తామనేది భ్రమని చెప్పారు. గ్రూప్స్‌లో ఇంటర్వ్యూ తొలగించినందున పరిజ్ఞానం ఉన్నవాడికి పారదర్శకంగా ఉద్యోగం వస్తుందన్న నమ్మకం ఏర్పడిందన్నారు. గ్రూప్స్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌ నేపథ్యంలో అభ్యర్థులు ఏ విధంగా సన్నద్ధమవ్వాలనే అంశంపై రవీందర్‌ ‘సాక్షి’తో పంచుకున్న అంశాలు ఆయన మాటల్లోనే...

లక్ష్య సాధన దిశగా విద్యార్థుల పాత్రేంటి?
ఉస్మానియా యూనివర్సిటీ ఈ మధ్య దీనిపై లోతుగా అధ్యయనం చేసింది. చాలామంది విద్యార్థుల్లో అంతర్లీనంగా సామర్థ్యాలున్నాయి. దృష్టి పెడితే పోటీ పరీక్షల్లో విజయం సాధించగల సత్తా ఉంది. కానీ వాళ్లు స్వల్పకాలిక లక్ష్యాలకే ప్రాధాన్య మిస్తున్నారు. ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటున్నారు. దీంతో గ్రూప్స్‌ పోటీకి దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకోలేకపోతున్నారు. దీన్ని గమనిం చిన తర్వాత ఓయూలో సివిల్స్‌ అకాడమీని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. దీని కోసం రూ.37 లక్షలు ఖర్చు పెట్టాం.

కోచింగ్‌ కేంద్రాలతో ఫలితం ఎలా ఉంటుంది?
లక్షల మంది విద్యార్థులు కోచింగ్‌ కేంద్రాల బాట పడుతున్నారు. అక్కడికి వెళ్తేనే పోటీ పరీక్షల్లో రాణిస్తామని భ్రమ పడుతున్నారు. నా అనుభవం ప్రకారం ఇది శుద్ధ దండగ. అక్కడ కేవలం షార్ట్‌ కట్‌ పద్ధతులు మాత్రమే చెబుతారు. ఒకరకంగా ఇది మల్టిపుల్‌ చాయిస్‌ లాంటిదే. ఆ మాదిరి ప్రశ్న వస్తేనే అభ్యర్థి సమాధానం ఇవ్వగలడు. కానీ సొంతంగా సబ్జెక్టుపై అవగాహన పెంచుకుంటే మెరుగైన రీతిలో గ్రూప్స్‌లో రాణించే వీలుంది. కాబట్టి కోచింగ్‌ కేంద్రాలకు వెళ్లి విద్యార్థులు తమ విలువైన కాలాన్ని వృథా చేసుకోవద్దు. 

ఏం చదవాలి?
గ్రూప్స్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవాలి. ముఖ్యంగా 8 నుంచి ఇంటర్‌ వరకూ ఉన్న పుస్తకాలను అభ్యసించాలి. వీటిల్లో లోతైన విషయ పరిజ్ఞానం ఉంటుంది. ఎన్‌సీఈ ఆర్‌టీ, సీబీఎస్‌సీ ఇంటర్మీడియెట్‌ పుస్తకాలు.. రాష్ట్ర సిలబస్‌తో పోలిస్తే పోస్ట్‌గాడ్యుయేషన్‌ పుస్తకాలతో సమానం. ప్రతీ పాఠం తర్వాత పాఠానికి కొనసాగింపు ఉంటుంది. దీనివల్ల సబ్జెక్టుపై పట్టు వస్తుంది. ఫలితంగా గ్రూప్స్‌లో ఏ రూపంలో ప్రశ్న వచ్చినా తేలికగా సమాధానం ఇవ్వగలిగే సత్తా విద్యార్థులకు ఉంటుంది. 

ఆప్షన్స్‌ ఎంపిక ఎలా ఉండాలి?
ఈ మధ్య గ్రూప్‌–2లో సోషల్‌ సబ్జెక్టు ఆప్షన్‌గా తీసుకున్న ఇంజనీరింగ్‌ విద్యార్థులే మంచి స్కోర్‌ సాధించారు. కొత్త సబ్జెక్టు అయితే, మూలాల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి లోతుగా అధ్యయనం చేసే విద్యార్థి ఆప్షన్‌ విషయంలో ఏది తీసుకున్నా మెరుగైన ఫలితాలే ఉంటాయి. సివిల్స్‌లో కూడా ఇదే ట్రెండ్‌ కన్పిస్తోంది.

తక్కువ సమయంలో ప్రిపరేషన్‌ ఎలా?
సాధ్యమే. రోజూ ఒక గంట ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలు చదవాలి. ఆ తర్వాత దినపత్రికల్లో సంపాదకీయాలు చదవాలి. నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవాలి. ప్రముఖ రచయితల పుస్తకాలు చదవాలి. పోటీ పరీక్షలకు గ్రూప్‌ డిస్కషన్స్‌ చాలా ముఖ్యం. ఈ తరహా చర్చల వల్ల లోతైన పరిజ్ఞానం అలవడే వీలుంది. నెల రోజులు సీరియస్‌గా చదివితే కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లకుండానే గ్రూప్స్‌ కొలువు కొట్టొచ్చు. అలాగే, ఇంగ్లిష్‌ భాషపై పట్టు సాధించే ప్రయత్నం చేయాలి. మానసిక ఒత్తిడిని జయించాలి. సమయపాలన చాలా ముఖ్యం. దీనిపై ప్రిపరేషన్‌ నుంచే దృష్టి పెట్టాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement