వేగన్‌.. కేసేఫ్‌ | Vegan Restaurants in Hyderabad | Sakshi
Sakshi News home page

వేగన్‌.. కేసేఫ్‌

Published Sun, Jun 23 2024 8:12 AM | Last Updated on Sun, Jun 23 2024 8:30 AM

Vegan Restaurants in Hyderabad

పదుల సంఖ్యలో వెలుస్తున్న కేఫ్‌లు
గణనీయంగా పెరిగిన వేగనిస్టులు
నయా ట్రెండ్‌ ఫాలో అవుతున్న యువత

మార్క్సిజం.. లెనినిజం.. జగనిజం.. ఇవన్నీ రెగ్యులర్‌గా వినేవే.. కొత్తగా ఈ వేగనిజం ఏంటి అనుకుంటున్నారా..? అదేనండి...జంతువుల మాంసమే కాకుండా పాలు, గుడ్లు, నెయ్యిలాంటి ఇతర జంతు సంబంధిత పదార్థాలను తినని వారిని, జంతు సంబంధిత పదార్థాలతో తయారు చేసిన వస్తువులను వాడని వారిని వేగన్స్‌గా పరిగణిస్తారు. దీనికున్న మరో పేరే వేగనిజం. నగరంలో గత కొంతకాలంగా వేగనిజం ప్రాచుర్యం పొందుతోంది. జీవ హింసకు వ్యతిరేకంగా, మూగజీవాల స్వేచ్ఛా వాతావరణానికి హాని తలపెట్టనివారందరూ వేగనిస్టులుగా మారుతున్నారు. వినూత్న రుచులకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన భాగ్యనగరంలో వేగనిస్టుల కోసం పదుల సంఖ్యలో వేగన్‌ కేఫ్‌లు, రెస్టారెంట్లు వెలుస్తున్నాయి.. ఈ నేపథ్యంలో వేగనిజంపై మరిన్ని విశేషాలు..

సాక్షి, హైదరాబాద్‌: నవాబుల కాలం నుంచి నేటి వరకూ... బిర్యానీ మొదలు విశ్వవ్యాప్త ప్రాచుర్యం కలిగిన కాంటినెంటల్‌ ఫుడ్స్‌ వరకూ భాగ్యనగరంలో దొరకనిదేదీ లేదు..ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ తయారయ్యే బిర్యాని విదేశాలకు ఎగుమతవుతుందనే విషయం చాలా మందికి తెలిసుండకపోవచ్చు.. అలా అనేక వెరైటీలకు పేరుగాంచిన నగరంలో ప్రస్తుతం కొత్తగా వినిపిస్తున్న మాట వేగన్‌ ఫుడ్‌.. ‘వేగనిజం’లో భాగంగా పుటుకొచి్చందే ఈ వేగన్‌ ఫుడ్‌. 

జీవుల భద్రతకు పాటుపడేవారిని వేగన్స్‌గా పరిగణిస్తారు. గత దశాబ్దకాలంగా జంతు ప్రేమికుల ఆధ్వర్యంలో వేగన్‌ క్లబ్‌లు, వేగన్‌ గ్రూప్స్‌ ఏర్పడుతున్నాయి. ఇందులో భాగంగా వేగన్‌ ఫుడ్‌ తినే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సందర్భంగా నగరంలో వేగన్‌ ఫుడ్‌ ప్రాచుర్యం పొందడమే కాకుండా ఎన్నో వేగన్‌ ఫుడ్‌ కోర్ట్‌లను ప్రారంభిస్తున్నారు. ఇలా 2015లో నగరంలోని బంజారాహిల్స్‌లో మొట్టమొదటి వేగన్‌ కేఫ్‌ ఏర్పాటు చేయగా ప్రస్తుతం పదుల సంఖ్యలో ఉన్నాయి. అంతేగాకుండా 2019లోనే ‘పెటా’ ఆధ్వర్యంలో ‘మోస్ట్‌ వేగన్‌ ఫ్రెండ్లీ సిటీ’గా నగరాన్ని ఎంపిక చేయడం విశేషం.  
వినూత్నంగా వేగన్‌ క్లబ్‌లు..  
వేగనిజం పై అవగాహన పెరుగుతుండటంతో పలువురు జంతు ప్రేమికులు ఒక సమూహంగా వేగన్‌ క్లబ్‌లను ఏర్పాటు చేసుకొని వేగన్‌ ఫుడ్‌ కార్యక్రమాలను జరుపుతున్నారు. ఇందులో భాగంగా మాంసమే కాకుండా ఎలాంటి జంతు పదార్థాలను తినకూడదు. అందుకోసమే పల్లీలు, బాదం నుంచి తీసిన పాలతో పెరుగు, పన్నీర్‌లాంటి వినూత్న పదార్థాలను తయారు చేస్తున్నారు. మాంసాన్ని పోలి ఉండే ప్లాంట్‌ మీట్‌ను తయారు చేస్తున్నారు. 

భిన్న రుచుల సమ్మేళనం.. 
వేగన్స్‌ కోసం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సైనిక్‌ పురి తదితర ప్రాంతాల్లో ఫుడ్‌ రెస్టారెంట్‌లు, బేకరీలు, ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లు వంటి ఫుడ్‌ స్పాట్స్‌ ఉన్నాయి. జంతు సంబంధ పదార్థాలు లేకుండా కూరగాయలు, ఆకుకూరలు తదితర మొక్కల పదార్థాలతో ఈ ఫుడ్‌ని తయారు చేస్తారు. ఇందులో భాగంగా డిషెస్, సలాడ్స్, డిసర్ట్స్, కేక్‌లు, చాక్‌లెట్లు తయారు చేస్తున్నారు.

ఆరోగ్య ప్రదాయిని..
జంతు హింసపై అవగాహన పెంచడమే కాకుండా వేగన్‌ల ఆహార సౌలభ్యం కోసం వినూత్నంగా వేగన్‌ ఫుడ్‌ స్టోర్‌–కేఫ్‌ను ఏర్పాటు చేశాం. వేగన్స్‌ని సంతృప్తి పరచడానికి పిజ్జాలు, డిసర్ట్స్‌తో పాటు పలు రకాల ఫుడ్‌ వెరైటీలు తయారు చేస్తున్నాం. జీవన సమతుల్యం కోసమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని అందించడంలో వేగన్‌ ఫుడ్‌ విశిష్టతను కలిగి ఉంటుంది.       – వేద్‌ మోహన్, 
    ఈ–వేగన్‌ ఫుడ్‌ స్టోర్‌–కేఫ్, సైనిక్‌పురి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement