
సాక్షి, వికారాబద్: ఓ వైపు కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్‌డౌన్ విధించి.. కఠిన చర్యలు తీసుకుంటుంటే మరోవైపు కొందరు మాత్రం మాకివేం వర్తించవన్నట్లు ప్రవర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు తాము ఈ నిబంధనలకు తాము అతీతులమన్నట్లు భావిస్తూ.. ఆంక్షలను తుంగలో తొక్కుతున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఓ టీఆర్‌ఎస్ నాయకుడు లాక్‌డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి తన ఇంట్లో రికార్డ్ డ్యాన్స్ కార్యక్రమం నిర్వహించడం పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలోని దోమ మండలం దిర్సంపల్లి గ్రామానికి చేందిన టీఆర్‌ఎస్ నాయకుడు ఒకరు లాక్‌డౌన్ ఆంక్షలు తుంగలో తొక్కి తన ఇంట్లో అర్థరాత్రి రికార్డు డ్యాన్స్‌లతో హోరెత్తించాడు. వందలమందిని ఆహ్వానించి విందు ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌కావడంతో పోలీసులపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. లాక్‌డౌన్ సందర్భంగా ఆరు దాటితే జనాలను బయటకు అడుగుపెట్టకుండా చూస్తున్న పోలీసులు ఈ విందు-చిందు కార్యక్రమాన్ని పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.