
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో స్వచ్ఛంద పదవీ విరమణ అంశంపై అధికారులు కసరత్తు ప్రారభించారు. ప్రస్తుతం సంస్థ తీవ్ర నష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఖర్చును తగ్గించాలంటే ఉద్యోగుల సంఖ్యను కుదించటమొక్కటే మార్గమని భావిస్తున్నారు. ఇందుకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) పథకాన్ని ప్రవేశపెట్టడం మినహా గత్యంతరం లేదనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదించేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపు భేటీ అయ్యారు. ఆర్టీసీ ఆర్థిక స్థితిపై వాకబు చేసిన ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పల్లెవెలుగు, సిటీ సర్వీసులతో ఆర్టీసీ స్థితిగతులు ఎప్పటికి మారతాయని, ఆదాయాన్ని అందించే దూరప్రాంత సర్వీసులను ఎందుకు మెరుగుపరచటం లేదని నిలదీశారు.
4 వేల మంది మిగులు ఉద్యోగులు
సర్వీసుల సంఖ్య కుదింపు, దాదాపు నాలుగు వేల మంది ఉద్యోగులు ‘మిగులు’గా మారిన విషయం అధికారులు ప్రస్తావించారు. ఆర్టీసీలో కూడా పదవీ విరమణ వయసును రెండేళ్లకు (60 ఏళ్లు) పెంచటం, మిగులు ఉద్యోగులు ఉండటం, రిటైర్మెంట్లు లేకపోవటంతో ప్రొడక్టివిటీ తగ్గి జీతాల భారం పెద్ద సమస్యగా మారిందన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ క్రమంలోనే దీనికి స్వచ్ఛంద పదవీ విరమణ పథకం పరిష్కారమనే తమ అభిప్రాయాన్ని అధికారులు సీఎం దృష్టికి తెచ్చినట్టు సమాచారం. అయితే దీనిపై ముఖ్యమంత్రి ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించలేదని తెలిసింది. 55 ఏళ్లు మొదలు 60 ఏళ్ల వయసు వరకు ఉన్న ఉద్యోగుల సంఖ్యను మాత్రం ఆయన ప్రశ్నించారు. దానికి అధికారుల వద్ద కచ్చితమైన లెక్కలు లేకపోవటంతో ఉజ్జాయింపు లెక్కలు వెల్లడించారు. తాజాగా ఆయా వివరాలను సీఎంకు సమర్పించేందుకు అధికారులు పక్కాగా లెక్కలు వేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం తెస్తే భారీగా ప్రయోజనాలు అందించాల్సి ఉంటుంది. అందుకు పెద్ద మొత్తంగా నిధులు కావాలి. దీంతో ఇప్పటికే ఆర్టీసీకి ఉన్న భూములు, వాటిల్లో ఉపయోగంలో ఉన్నవి, ఖాళీగా ఉన్నవి.. తదితర వివరాలను కూడా అధికారులు సిద్ధం చేసి పెట్టారు.
ఒకేరోజు రూ.13 కోట్ల ఆదాయం
గత ఏడాదిన్నరలో ఎన్నడూ లేనట్టుగా ఆర్టీసీ సోమవారం రోజున రూ.13.04 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. కోవిడ్‌కు ముందు రోజుల్లో ఉన్నట్టుగా ఆదాయం రావటంతో ఆర్టీసీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 78 శాతం ఆక్యుపెన్సీతో ఈ మొత్తం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment