ED Submits Chargesheet Over Cash-For-Vote Scam - Sakshi
Sakshi News home page

ఓటుకు  కోట్లు కేసు..ఈడీ చార్జిషీట్‌

Published Thu, May 27 2021 2:33 PM | Last Updated on Fri, May 28 2021 2:21 PM

Vote For Note Case ED Submits Chargesheet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు కోట్లు కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో మనీ ల్యాండరింగ్‌ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం నాంపల్లి ఈడీ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని ప్రధాన నిందితుడిగా, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, టీడీపీ క్రిస్టియన్‌ సెల్‌ నేత హ్యారీ సెబాస్టియన్, రేవంత్‌ అనుచరుడు రుద్రశివకుమార్‌ ఉదయసింహ, జెరుసలేం మత్తయ్యతోపాటు వేం కృష్ణకీర్తన్‌లను నిందితులుగా పేర్కొంది.

2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డికి ఓటేయాలని, రూ.5 కోట్లు ఇస్తామని నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టి.. రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తూ రేవంత్, ఇతర నిందితులు ఏసీబీకి పట్టుబడ్డారని తమ దర్యాప్తులో తేలిందని ఈడీ వెల్లడించింది. ఈ కేసులో వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్‌ పాత్ర కూడా ఉన్నట్టు తేలడంతో ఆయన పేరునూ చార్జిషీటులో చేర్చినట్టు తెలిపింది. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు ఈడీ ప్రకటించింది.

ఈ చార్జి షీటులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పేరును కూడా పలుచోట్ల ప్రస్తావించినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో ఇంతకుముందే చార్జిషీట్లు దాఖలు చేసిన ఏసీబీ కూడా చంద్రబాబు పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ‘మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ’ అంటూ చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడిన ఆడియోలు వెలుగులోకి రావడం, ఆ గొంతు చంద్రబాబుదేనని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టు కూడా ధ్రువీకరించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా ఈడీ చార్జిషీటు దాఖలు చేయడం మరింత ఉత్కంఠగా మారింది. 
 
మహానాడు వేదికగా కుట్ర 
2015లో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యేకోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి బలం లేకున్నా కూడా.. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తమ పార్టీ తరఫున వేం నరేందర్‌రెడ్డిని పోటీలో పెట్టారు. ఎలాగైనా గెలవాలని, పలువురు ఎమ్మెల్యేలను డబ్బుతో ప్రలోభపెట్టి ఓటు వేయించుకోవాలని కుట్రపన్నారు. అప్పట్లో టీడీపీ కొడంగల్‌ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డికి కొనుగోళ్ల బాధ్యత అప్పగించారు. ఇందులోభాగంగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు గాలం వేయాలని నిర్ణయించారు. టీడీపీ మైనార్టీ సెల్‌ నేత హ్యారీ సెబాస్టియన్, తెలుగు యువత నేత జిమ్మిబాబుల సాయంతో జేరుసలేం మత్తయ్యను కలిసి విషయం చెప్పారు.

తర్వాత హైదరాబాద్‌ శివార్లలోని గండిపేటలో జరిగిన టీడీపీ మహానాడుకు మత్తయ్యను తీసుకెళ్లారు. అక్కడ వేదిక వెనకాల ఉన్న గదిలో.. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలతో మత్తయ్య సమావేశమయ్యారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేలా ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ఒప్పిస్తే.. రూ.50లక్షలు ఇస్తామని మత్తయ్యను ప్రలోభపెట్టారు. స్టీఫెన్‌సన్‌ ఓటింగ్‌కు గైర్హాజరైతే రూ.3 కోట్లు, అనుకూలంగా ఓటేస్తే రూ.5 కోట్లు ఇస్తామని బేరం పెట్టారు. రూ.50 లక్షలు కమీషన్‌ వస్తుందని ఆశపడ్డ మత్తయ్య.. ఈ విషయాన్ని స్టీఫెన్‌సన్‌కు చెప్పారు.

(మత్తయ్య ఈ మొత్తం వ్యవహారాన్ని వాంగ్మూలం రూపంలో ఇటీవల ఈడీకి లిఖితపూర్వకంగా రాసిచ్చారు). ఇదంతా భారీ కుట్ర అని గుర్తించిన స్టీఫెన్‌సన్‌ వెంటనే ఏసీబీకి సమాచారం ఇచ్చారు. రేవంత్, ఆయన అనుచరులు 2015 మే 31న స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తుండగా ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీనిపై తొలుత టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. కానీ ఈ కుట్ర తాలూకు బాగోతం మొత్తం వీడియోలు, స్టీఫెన్‌సన్‌తో ‘మన వాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ’ అంటూ చంద్రబాబు మాట్లాడిన ఆడియోలు వెలుగు చూడటం దేశవ్యాప్తంగా సంచనలనం సృష్టించింది.

దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. పెద్ద మొత్తంలో డబ్బుల ఒప్పందాలు, సొమ్ము చేతులు మారడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టి సారించింది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా.. ప్రీవెన్షన్‌ ఆఫ్‌ మనీ ల్యాండరింగ్‌ యాక్ట్‌ 2002 కింద కేసు నమోదు చేసింది. 2019 ఫిబ్రవరి, మార్చి నెలల్లో రేవంత్‌రెడ్డి, ఉదయసింహా, వేం నరేందర్‌రెడ్డి, సెబాస్టియన్, స్టీఫెన్‌సన్‌ల వాంగ్మూలాలను నమోదు చేసింది. అడ్వాన్స్‌గా తెచి్చన రూ.50 లక్షలు ఎలా వచ్చాయి, మిగతా రూ.4.5 కోట్లు ఎక్కడ ఉంచారు, విదేశాల నుంచి డబ్బులు వచ్చాయా? అన్న అంశాలపై దర్యాప్తు చేసింది. 
 
ఏపీకి వెళ్లిపో.. ఏమీ కాదంటూ లోకేశ్‌ భరోసా! 
‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో పాత్రధారి అయిన జేరుసలేం మత్తయ్య.. ఈ కుట్రకు సంబంధించి ఇటీవలే ఈడీ అధికారులకు రాతపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చారు. తనను ఎవరెవరు కలిశారు, ఎవరు డబ్బులు ఎర వేశారు, మొత్తం వ్యవహారం ఎలా జరిగిందన్నది వివరంగా వెల్లడించారు. మొత్తం కుట్రలో చంద్రబాబుదే మాస్టర్‌ మైండ్‌ అని.. అప్పట్లో తాను విజయవాడకు పారిపోవడానికి చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ సూచనలే కారణమని బయటపెట్టారు.

మత్తయ్య వాంగ్మూలంలో చెప్పిన ప్రకారం.. రేవంత్‌ అరెస్టు విషయం తెలియగానే జిమ్మిబాబు సాయంతో మత్తయ్య ఎన్టీఆర్‌ భవన్‌కి వెళ్లారు. అక్కడ చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ను కలిశారు. నీకేమీ కాదని, వెంటనే విజయవాడ వెళ్లిపోవాలని మత్తయ్యకు లోకేశ్‌ అభయమిచ్చారు. అక్కడ టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని, విజయవాడలో భద్రంగా ఉండొచ్చని చెప్పారు. ఈ సూచనల మేరకే మత్తయ్య విజయవాడ వెళ్లారు. 

అదే మహానాడు సమయంలో.. 
2015 మహానాడు వేదికగానే ‘ఓటుకు కోట్లు’ కుట్ర జరిగింది. దీనికి సూత్రధారి చంద్రబాబేనని బయటపడటం సంచలనం సృష్టించింది. ఇప్పుడు కూడా టీడీపీ మహానాడు వేడుకలు (ఆన్‌లైన్‌)లో జరుగుతుండగా.. ఈ వ్యవహారంలో ఈడీ చార్జిషీటు నమోదవడం ఆసక్తిగా మారింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement